ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, అయితే.. భారత్ లో వ్యాప్తి అంతగా లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. కరోనా విషయంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూనే వున్నామని ప్రకటించారు. కరోనా పరిస్థితులపై మన్సుఖ్ మాండవీయ లోక్ సభలో ప్రత్యేక ప్రకటన చేశారు. కోవిడ్ వ్యాప్తి నిరోధం కోసం తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరినట్లు తెలిపారు. మాస్క్ ధరించాలనే నిబంధనను విధించాలని, జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని చెప్పినట్లు తెలిపారు. కోవిడ్-19 వైరస్ నిరంతరం క్రమంగా వృద్ధి చెందుతోందనే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ మహమ్మారిని అరికట్టడంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చురుగ్గా వ్యవహరిస్తోందన్నారు. నేరుగా ఈ వ్యాధిపై పోరాటం చేసేందుకు రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 220 కోట్ల కోవిడ్ టీకా మోతాదులను పంపిణీ చేసినట్లు తెలిపారు. కొద్ది రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, అయితే భారత దేశంలో వాటి సంఖ్య తగ్గుతోందని కేంద్ర మంత్రి చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ర్యాండమ్ శాంపిల్స్ సేకరణ మొదలైందని, కొత్త వేరియంట్లపై అప్రమత్తంగానే వున్నామని మన్సుఖ్ మాండవీయ తెలిపారు. జూలై- నవంబర్ మధ్య కాలంలో దేశంలో బీఎఫ్ 7 రకానికి చెందిన నాలుగు కేసులు నమోదయ్యాయని సభలో వెల్లడించారు. న్యూ ఇయర్ వేడుకలు, రాబోయే పండగ సీజన్ నేపథ్యంలో రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా వుండాలని పిలుపునిచ్చారు. మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడకంతో పాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.












