తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి మంత్రి పదవి స్వీకరించేందుకు రెడీ అయ్యారు. బుధవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రిగా ఉదయనిధి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉదయనిధికి రాష్ట్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఇవ్వనున్నారు. ఇప్పటికే సచివాలయంలో ఆయన కోసం ఓ ప్రత్యేక ఛాంబర్ కూడా ఏర్పాటైంది.
కొన్ని రోజులుగా ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఊహాగానాలు బాగా వినిపించాయి. అయితే.. కుటుంబ రాజకీయాలను స్టాలిన్ ప్రోత్సహిస్తున్నారని విమర్శలు బాగా వచ్చాయి. అందుకే కాస్త వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఏది ఏమైనా… ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని స్టాలిన్ నిర్ణయించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధి చేపాక్ ట్రిప్లికేన్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.












