మహారాష్ట్రలోని శివసేన పార్టీ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. విల్లు, బాణం గుర్తును ఏక్ నాథ్ షిండే కు ఈసీ కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.అయితే ఈ పిటిషన్ అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరించింది. మంగళవారం మళ్ళీ బెంచ్ ముందు ప్రస్తావించాలని సూచించింది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన పార్టీ మాజీ చీఫ్ ఉద్ధవ్ థాక్రేకు ఊహించని షాక్ తగిలింది. పార్టీ చీలిక వర్గమైన ప్రస్తుత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గానికే శివసేన పార్టీ పేరు, ఆ పార్టీకి చెందిన విల్లు, బాణం గుర్తు దక్కుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రస్తుత శివసేన రాజ్యాంగం అప్రజాస్వామికమని భారత ఎన్నికల సంఘం పేర్కొంది.
అయితే… దీనిపై మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ తీవ్రంగా స్పందించారు. ఈసీ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. ఈసీ నిర్ణయంపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు ఈసీ ఉత్తర్వులను పక్కన పెడుతుందని తాము ఖచ్చితంగా అనుకుంటున్నామని ఉద్ధవ్ తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య ఆధారంగా పార్టీ ఉనికిని నిర్ణయిస్తే ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీలను కొనుగోలు చేసి సీఎం కాగలరని థాకరే అన్నారు. షిండే వర్గానికి చెందిన వారు ముందుగా బాలాసాహెబ్‌ను అర్థం చేసుకోవాలని చెప్పారు. మహారాష్ట్రలో మోడీ పేరు పనిచేయదు కాబట్టే వారు తమ స్వలాభం కోసం బాలాసాహెబ్ ముసుగుతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారని ఉద్ధవ్ విమర్శించారు.
మరోవైపు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. షిండే వర్గం శివసేన పేరును, పార్టీ గుర్తు విల్లు-బాణాన్ని సంపాదించేందుకు రూ. 2000 కోట్లు లంచంగా ముట్టజెప్పిందని ఆరోపించారు. ఈ మొత్తం ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంతకంటే ఎక్కువే చేతులు మారి ఉంటుందని ఆదివారం ట్వీట్ చేశారు. ‘శివసేన పేరు, గుర్తు కోసం రూ.2000 కోట్లు చేతులు మారినట్టు నా వద్ద విశ్వసనీయ సమాచారం ఉన్నది. త్వరలో చాలా విషయాలు బయటకు వస్తాయి. అంటూ ట్వీట్ చేశారు.












