ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5 వరకూ తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కు ఆహ్వానాలు అందాయి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సీఎం జగన్ ను కలుసుకున్నారు. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసి, ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ కు ప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందజేవారు. మరోవైపు రాజ్ భవన్ లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కూడా కలుసుకున్నారు. వారికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానించారు.
మరోవైపు బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లనీ పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని, అందుకు తగ్గ భద్రతా ఏర్పాట్లు కూడా చేశామని టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా 5 వేల మంది పోలీసులతో బ్రహ్మోత్సవాలకు భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. మాడ వీధుల్లోకీ భక్తులు సులభతరంగా వచ్చే విధంగా క్యూ లైన్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఘాట్ రోడ్డులలో ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.