ప్రైవేట్ ట్రావెల్స్ మాదిరే… అత్యాధునిక హంగులతో టీఎస్‌ఆర్టీసీ కూడా కొత్తగా 16 ఏసీ స్లీపర్‌ బస్సులను తీసుకురానున్నది. మార్చి నెలలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువయ్యేందుకు హైటెక్‌ మాడల్‌లో ఈ బస్సులను రూపొందించింది. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది.

నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్‌ బస్సులకు లహరి అని పేరు పెట్టారు. అత్యాధునిక సదుపాయాలున్న ఓ నమూనా బస్సు నిన్న హైదరాబాద్‌లోని బస్ భవన్‌కు చేరుకుంది. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఆపరేషన్స్ ఈడీ పీవీ మునిశేఖర్ ఈ బస్సును పరిశీలించారు. కాగా, టీఎస్ఆర్టీసీ ఇటీవల నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులను ప్రవేశపెట్టింది. ఇప్పుడు పూర్తి స్లీపర్ బస్సులను తీసుకొస్తోంది.

మీటర్ల పొడవుండే బస్సులో కింద 15, పైన 15 చొప్పున మొత్తం 30 బెర్తులు ఉంటాయి. ప్రతి బెర్త్‌కు సెల్‌ఫోన్ చార్జింగ్ సదుపాయం, వాటర్ బాటిల్ పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. అలాగే, వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతోపాటు పానిక్ బటన్ కూడా ఉంటుంది. అత్యవసర సమయాల్లో దీనిని వినియోగించవచ్చు. బస్సులో వై-ఫై సదుపాయం, భద్రత కోసం రెండు సీసీ కెమెరాలు ఉంటాయి. అగ్ని ప్రమాదాలను ముందే గుర్తించగలిగే ఫైర్ డిటెక్షన్ సిస్టం కూడా ఈ బస్సుల్లో ఉంటుంది.