టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు శుభ వార్త అందించింది. ఉద్యోగులకు మూడు డీఏలతో పాటు దసరాకు ఇవ్వాల్సిన పండుగ బోనస్‌ను ఇస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. సకల జనుల సమ్మె కాలంలో జీతాలు రాని 8,053 మంది ఉద్యోగుల కోసం రూ.25 కోట్లు విడుదల చేస్తున్నట్లు బస్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. పదవీ విరమణ చేసిన సిబ్బంది ఈఎల్(ఎర్నెడ్ లీవ్స్)ను చెల్లించేందుకు మరో రూ.20 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్ పరిశీలనలో పీఆర్సీ, యూనియన్ పునరుద్ధరణ అంశాలు వున్నాయని బాజిరెడ్డి వెల్లడించారు. డిసెంబర్ నెలాఖరు నాటికి 1150 కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కొత్త బస్సులు వచ్చే వరకూ కార్మికులు ఓపిక పట్టాలని కోరారు. ఆర్టీసీ రోజువారీ ఆదాయం 15 కోట్లని, ఆర్టీసీలో పీఆర్సీ డిమాండ్ చాలా ఏళ్లుగా వుందని, అయితే ఎన్నికల కోడ్ కారంగా ఇవ్వలేకపోతున్నామని అన్నారు.