తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పోలీసుల పనితీరు అద్భుతంగా వుందని హోంమంత్రి మహమూద్ అలీ కితాబునిచ్చారు. శాంతి భద్రతలు అదుపులో వుంటేనే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుందని అన్నారు. గోషామహల్ స్టేడియంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి,హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, పోలీస్ ఉన్నతాధికారులు, రిటైర్డ్ పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసులకు నివాళులర్పించారు.
ఇక.. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… విధి నిర్వహణలో అసువులు బాసిన వారికి నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 న పోలీసుల అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ సంవత్సరం 264 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైనారని గుర్తు చేశారు. తెలంగాణ పోలీసు దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో ముందుకు సాగుతుందన్నారు. ప్రజలకు నిరంతరం సేవ చేస్తోందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో తెలంగాణ ప్రజలకు రక్షణ కల్పిస్తున్నామని, రానున్న రోజుల్లో 15 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసులకు నగదు రహిత చికిత్సలు, కుటుంబాలకు కార్పొరేట్ ఉచిత విద్య, విదేశీ విద్యకు నిధులతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.