ఫాం హౌస్ కేసులో తెలంగాణ సర్కారుకు మళ్లీ ఎదురుదెబ్బ తగలింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకు బదిలీ చేస్తూ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. కేసును సీబీఐకు అప్పగించొద్దంటూ ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దాఖలు చేసిన అప్పీళ్లను న్యాయస్థానం కొట్టివేసింది. సింగిల్ జడ్జి తీర్పును తప్పుబట్టలేమని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ టి.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై నేటితో తెర పడింది. ఈ తీర్పు ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ లో కీలకం కానున్న నేపథ్యంలో… హైకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇవ్వాళ్టి తీర్పుతో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. కాగా ఈ ఆర్డర్‌పై సుప్రీం కోర్టు కు వెళ్లేందుకు కొంత సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ అడిగారు. అప్పటి వరకు ఆర్డర్‌ను సస్పెండ్‌లో ఉంచాలని కోరారు. అయితే ఆర్డర్ సస్పెన్షన్‌కు హైకోర్టు నిరాకరించింది. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే పలు ట్విస్టులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీంతో సింగిల్ బెంచ్ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే వాదనలు వినిపించారు.







