బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ 12వ తేదీ నుంచి నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఆయన మూడు ధపాలుగా పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. నాలుగో విడత పాదయాత్రకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాయి. హనుమకొండ వేదికగా నాలుగో దఫా పాదయాత్ర చేపడతానని, దమ్ముంటే సీఎం కేసీఆర్ అడ్డుకోవాలని బండి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఇక.. మొత్తం 11 రోజుల పాటు.. 110కి.మీ. మేర పాదయాత్ర సాగుతుంది. మల్కాజ్‌గిరి పార్లమెంట్ సహా 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుంది. పెద్ద అంబర్‌పేట్‌లో 22వ తేదీన ముగింపు సభ నిర్వహించనున్నారు.

 

ఇక… బండి సంజయ్ పాదయాత్రను ఎవ్వరూ అడ్డుకోలేరని పాదయాత్ర ఇన్ ఛార్జీ, బీజేపీ సీనియర్ నేత మనోహర్ రెడ్డి అన్నారు. పోలీసులు అనుమతులు ఇవ్వకున్నా… పాదయాత్ర మాత్రం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 10 రోజుల పాటు మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుందని, ఇప్పటికే మూడు కమిషనరేట్ ల అనుమతి కోరామని తెలిపారు. అయితే.. వారు రాతపూర్వకంగా అనుమతి ఇవ్వలేదన్నారు.