వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విషయంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా బీజేపీపై మండిపడింది. “తాము వదిలిన “బాణం” తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు” అంటూ కవిత ట్వీట్ చేశారు. వైఎస్సార్టీపీ కి బీజేపీ మద్దతిస్తోందని, రెండూ ఒకే తాను ముక్కలు అని పరోక్షంగా కవిత విమర్శలు చేశారు.
నర్సంపేటలో టీఆర్ఎస్ లీడర్ల దాడి, పోలీసుల తీరుకు నిరసనగా నిన్న షర్మిల చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్ లీడర్లు ధ్వంసం చేసిన కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. డోర్ లాక్ చేసుకుని కారులోనే ఉండిపోయారు. ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు క్రేన్ సాయంతో షర్మిల కారును లిఫ్ట్ చేసి ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ బలవంతంగా కారు డోర్లు తెరిచి వైఎస్సార్టీపీ అధినేత్రిని స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు. షర్మిల అరెస్ట్‌ను నిరసిస్తూ వైఎస్సార్టీపీ కార్యకర్తలు భవనంపైకి ఎక్కి నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరికి పోలీసులు ఆమెను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి ఆమెకు బెయిల్ మంజూరు చేశారు.
తాము వదిలిన “బాణం”
తానా అంటే తందానా అంటున్న “తామర పువ్వులు”— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 30, 2022