ఢిల్లీ లిక్కర్ స్కాం రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తో సహా మరికొందరు పేర్లను ఈడీ పేర్కొంది. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. జైళ్లో పెట్టుకోండి… అంత కంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. మోదీ కంటే ముందే ఈడీ వెళ్తుందని, వచ్చే డిసెంబర్ లో తెలంగాణలో ఎన్నికలు వున్నాయి కాబట్టి, మోదీ కంటే ముందే ఈడీ వచ్చిందని విమర్శించారు. తనతో పాటు మంత్రులపై, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం బీజేపీ హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ అని మండిపడ్డారు. దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతోందని, 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయతంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి, అడ్డదారిలో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. అయితే… రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు.

 

అయితే… ఆయా ఏజెన్సీలకు తాము తప్పకుండా జవాబిస్తామని కవిత అన్నారు. అంతేకానీ… మీడియాలో లీకులు ఇచ్చి, నేతలకు వున్న మంచి పేరు చెడగొట్టాలని ప్రయత్నిస్తే ప్రజలు తిప్పికొడతారని పేర్కొన్నారు. బీజేపీ తన పంథాను మార్చుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య యుతంగా ప్రజలను గెలవాలి తప్ప… ఈడీ, సీబీఐని ప్రయోగించి కాదన్నారు. అత్యంత చైతన్యవంతమైన ప్రజలు వున్న తెలంగాణలో అది సాధ్యపడదని వివరించారు. ప్రజలు తమ వెంట వున్నంత కాలం తమకు ఇబ్బంది రాదని కవిత ధీమా వ్యక్తం చేశారు.