ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఈడీ రెండో రోజు కూడా విచారించింది. దాదాపు 10 గంటల వరకూ ఎమ్మెల్యేని ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. బషీర్ బాగ్ లోని ఈడీ ఆఫీసుకి కిషన్ రెడ్డి మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో చేరుకోగా… రాత్రి 8 గంటల వరకూ ఈడీ ఆయన్ను విచారించింది. భోజన విరామ సమయంలో కుటుంబ సభ్యులు ఇంటి నుంచి తెచ్చిన భోజనాన్నే అధికారుల అనుమతితో అందించారు.

 

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటన ఎన్ని రోజులు కొనసాగింది? ఆ పర్యటనలో ప్రధానంగా చేసిన ఖర్చులేంటి? ఎక్కడ బస చేశారు? ఏయే ప్రాంతాలను సందర్శించారు? ఎవరెవరిని కలిశారు? ఇలా పర్యటనకు సంబంధించిన ప్రతి చిన్న విషయంపైనా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగే ఫారిన్‌‌ టూర్‌‌‌‌లో జరిపిన ట్రాన్సాక్షన్స్‌‌, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లపై ఈడీ సమగ్రంగా విచారించినట్లు సమాచారం. మరోవైపు ఇవ్వాళ కూడా విచారణకు రావాలని ఈడీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని కోరింది.