తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని తెలంగాణ రాష్ట్ర సమితి 33 జిల్లాల అధ్యక్షులు డిమాండ్ చేశారు. బీజేపీ ముక్త భారత్ కోసం కేసీఆర్ వెంటనే జాతీయ పార్టీని స్థాపించాలన్నారు. అన్ని రాష్ట్రాల్లో గులాబీ జెుండాను ఎగరేయాలని, తామంతా ఆయన వెంటే వుంటామని హామీ ఇచ్చారు. 33 జిల్లాల అధ్యక్షులు కలిసి తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. మోదీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నారని వారు అన్నారు. తెలంగాణ ప్రగతి నమూనా దేశమంతా విస్తరించాలని, బంగారు భారత్ గా మారాలని పేర్కొన్నారు.
మోదీ పాలన దుర్మార్గంగా వుందని, రాక్షస పాలన అంతం చేయడం కేవలం సీఎం కేసీఆర్ తోనే సాధ్యమని జిల్లాల అధ్యక్షులు అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలన్నీ దేశంలోనూ అమలు కావాలని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, కల్యాణ లక్ష్మి లాంటి పథకాలు దేశమంతా అమలు కావాలని, దేశంలోకి పెట్టుబడులు వరదల్లా రావాలని కోరారు. కేసీఆర్ నాయకత్వమే దేశానికి ఏకైక శరణ్యమని వారు స్పష్టం చేశారు. జాతీయ పార్టీ విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పటికే నిపుణులు, మేధావులతో చర్చలు చేస్తున్నారని జిల్లాల అధ్యక్షులు వెల్లడించారు.