పార్టీ పేరు మార్పుకు సంబంధించి టీఆర్ఎస్ బహిరంగ ప్రకటన చేసింది. తమ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్లు ఆ నోటిఫికేషన్ లో వుంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పేరుతో ఈ బహిరంగ ప్రకటన జారీ అయ్యింది. తమ పార్టీ కొత్త పేరు ప్రకటనపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపాలని అందులో పేర్కొన్నారు. అభ్యంతరాలను 30 రోజుల్లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని నోటిఫికేషన్ లో సూచించారు.
ఈ ఏడాది అక్టోబర్ 5 దసరా పండుగ రోజున టీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పార్టీ కార్యకలాపాలను జాతీయ స్థాయిలో విస్తరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు పార్టీ నియమావళిలో మార్పులు చేశామని స్పష్టం చేసింది.