తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ అనువాదకులకు ఇచ్చే పురస్కారాన్ని 2021 సంవత్సరానికి గాను ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మాడభూషి సపంత్‌కుమార్‌కు ప్రకటించింది. ఈ పురస్కారం కింద రూ. 2 లక్షల నగదు, జ్ఞాపిక ప్రదానం చేయనున్నారు. 21వ తేదీన ముఖ్యమంత్రి స్టాలిన్ నుంచి ఆయన పురస్కారాన్ని స్వీకరించనున్నారు. భారతీయార్, పట్టుకోట్టై కల్యాణ సుందరం కవితలు, కనిమొళి రాసిన కరువరై వాసనై, మానావరి మనిదర్‌గళ్, సామాజిక శాస్త్రవేత్త తదితర గ్రంథాలను సంపత్‌కుమార్ తెలుగులోకి అనువాదం చేయడంతో పాటు, తమిళ భాషాభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్లు తమిళ భాషాభివృద్ధి సంస్థ సంచాలకులు విడుదల చేసిన ఉత్తర్వుల్లో ప్రకటించారు. తమిళ జానపద కళలు, 20వ శతాబ్దపు తమిళ కవిత గ్రంథాలు, తిరుక్కురల్ విశిష్టితను గురించి అంతర్జాతీయ సదస్సుల్లో చేసిన ప్రసంగాలు, తమిళ తెలుగు తులనాత్మక పరిశీలనపై వ్యాసాలు రాయడం తదితర తమిళ భాషాభివృద్ధికి ఆయన చేసిన కృషిని తమిళ భాషాభివృద్ధి సంస్థ అభినందించింది.
………………..












