తాను చావనన్న చస్తాను కానీ బిజెపితో పొత్తుపెట్టుకోనని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. బీహార్‌లో మహా కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ చేయని కుట్ర లేదని ఆయన ఆరోపించారు. తన ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌పై కావాలని, ఎలాంటి ఆధారం లేకుండా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తేజస్వీ యాదవ్, ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై అవినీతి కేసులున్నందున్న తిరిగి బిజెపితో పొత్తుకుంటారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో బీహార్‌లోని 40 లోక్‌సభ సీట్లలో 36 గెలుచుకుంటామని బిజెపి చెప్పుకోవడాన్ని ఆయన కొట్టిపారేశారు. వారు ఇదివరలో పొత్తుపెట్టుకున్నప్పుడు ముస్లింలు సహా అన్ని వర్గాల మద్దతును పొందారు. కానీ వారందరికీ ఇప్పుడు బిజెపి హిందూత్వ భావజాలం ఏమిటో బాగా అర్థమైపోయింది. బీజేపీ ఐడియాలజీని తీవ్రంగా వ్యతిరేకించే ముస్లిం సమాజం కూడా వారికి ఓట్లు వేసిందని, ఈసారి అలా జరగదని చెప్పారు. బీజేపీ అలాంటి ఆశలు పెట్టుకుంటే అడియాశలే అవుతాయని నితీశ్‌కుమార్ ఎద్దేవా చేశారు.