ఇలాంటి ఘటనను ప్రపంచం ఎన్నడూ చూడలేదు.. ఉపరాష్ట్రపతి

చట్టాలను రద్దుచేసే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడిదని ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ప్రశ్నించారు. పార్లమెంటులో ఆమోదం పొంది చట్టంగా మారిన తర్వాత దానిని ఎలా రద్దు చేస్తారని అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ యాక్ట్‌-2014 (ఎన్‌జాక్‌)ను రద్దు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం 2015లో ఇచ్చిన తీర్పును ఉపరాష్ట్రపతి తప్పుబట్టారు. ఢిల్లీలో  డాక్టర్‌ ఎల్‌ఎం సింఘ్వీ 8వ స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా  ధన్‌కర్‌ మాట్లాడుతూ విస్తృత ప్రజాభిప్రాయానికి ప్రతీక అయిన ఆ చట్టం రాజ్యాంగ నిబంధన అయ్యింది. కానీ, దానిని న్యాయస్థానం కొట్టేసింది. ఇలాంటి ఘటనను ప్రపంచం ఎన్నడూ చూడలేదు. మనలాంటి చైతన్యవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో విస్తృత ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే చట్టాలు చేయకుంటే ఎలా? ఇలాంటి పరిణామాలు సమాజంలో విభజన రేఖలను గీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నది. ఇంకా ఆలస్యం కాలేదు. దీని గురించి అందరూ ఆలోచించాలి’ అని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో ధన్‌కర్‌తోపాటు సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌, మాజీ సీజేఐ జస్టిస్‌ ఆర్‌ఎం లోథా, కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌, మాజీ కేంద్రమంత్రి చిదంబరం, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates