ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే : జైశంకర్

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ తెలిపారు. సరిహద్దు సమస్య పరిష్కారమయ్యే వరకు రెండు దేశాల మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి రాబోవన్నారు. ఆయన ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడుతూ  లడఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంట ఇరు దేశాల మధ్య పరిస్థితులు చాలా సున్నితంగా, ప్రమాదకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఇరు దేశాల సైనిక బలగాలు అత్యంత సమీపంలో మోహరించి ఉన్నాయన్నారు. భారత్‌, చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రావాలంటే సరిహద్దు ప్రతిష్టంభనను చైనాయే పరిష్కరించాల్సి ఉన్నదన్నారు. 2020 సెప్టెంబర్‌లో సూత్రపాయంగా కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉన్నదని, ఆ ఒప్పందంలో అంగీకరించిన అంశాలను చైనా అమలు చేయాల్సి ఉన్నదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చైనాను చూసి భయపడుతోందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై జైశంకర్ ఘాటుగా స్పందించారు. “ చైనాపై రాహుల్ ప్రశంసలు గుప్పిస్తున్నారు. అదో పెద్ద తయారీదారు అని, మేక్ ఇన్ ఇండియా పనిచేయదని విమర్శిస్తున్నారు. ఒక దేశం గురించి ఎలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చు. కానీ జాతి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం సరికాదు. అలాంటి వారిని చూసినప్పుడు ఓ భారతీయుడిగా నేను ఇబ్బంది పడుతున్నా” అని విదేశాంగ మంత్రి రాహుల్‌ను దుయ్యబట్టారు.

Related Posts

Latest News Updates