బాలీవుడ్ తో పోటీ పడుతున్న తెలుగు సినిమా రంగం
దాదాపు 93 ఏళ్ళ పైన చరిత్ర వున్న తెలుగు సినిమా ఎన్నో మైలురాళ్ళను దాటుకుని, ఎన్నో మధురమైన సంఘటనలను పొందుపరుచుకుని వంద సంవత్సరాల వైపుకి పరుగులు తీస్తుంది. పలుమార్లు మన తెలుగు సినిమా చరిత్ర గురించి, రికార్డుల గురించి, తెలుగు సినిమా ఔన్నత్యాన్ని తెలియచేస్తూ ఎందరో రచయితలు, సినిమా జర్నలిస్టులు తమ రచనల్లో తెలియజేశారు. సుదీర్ఘ చరిత్రగల తెలుగు సినిమా కేవలం ఒక ప్రాంతానికే కాదు ఖండాంతరాలను అధిగమిస్తూ ప్రస్తుతం హాలీవుడ్‌తో సమానంగా సరితూగే సినిమాలను అందిస్తున్న సందర్భంగా తెలుగు టైమ్స్ అందిస్తున్న కవర్ పేజీ స్టోరీ.
దేశంలో చలనచిత్ర రంగంలో బాలీవుడ్ చిత్రాలు అగ్రస్థానంలో ఉండగా, దక్షిణ భారత సినిమా కొద్దిగా దిగువన ఆధిపత్యం చెలాయించింది. 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 50 భారతీయ చలన చిత్రాలలో సగం కంటే తక్కువ బాలీవుడ్ చిత్రాలు ఉండటం గమనిస్తే బాలీవుడ్ కన్నా ఇతర రంగాల సినిమాలు కలెక్షన్ల పరంగా ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ భారత సినిమారంగంలో టాలీవుడ్ ఇప్పటికీ తన ప్రజాదరణను కొనసాగిస్తోంది. 2021 నాటికే తెలుగు సినిమా బాక్సాఫీస్ పరంగా భారతదేశంలో అతిపెద్ద చిత్ర పరిశ్రమ. తెలుగు సినిమా అత్యధిక రాష్ట్ర థియేట్రికల్ వసూళ్లను 850 కోట్లుగా నమోదు చేయగా, తమిళ సినిమా, ఓటీటీ మరియు శాటిలైట్ హక్కులతో వరుసగా 807 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. కమర్షియల్ అప్పీల్, లైఫ్ కంటే పెద్ద కథాంశాలు, విఎఫ్ఎక్స్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, మాస్ మరియు క్లాస్ ప్రేక్షకులను తీర్చగల సామర్థ్యం కోసం ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా భారతదేశం అంతటా మరియు ఖండాంతరాలను దాటి ప్రపంచ ప్రేక్షకులను ఆకర్షించింది.
భవిష్యత్తును ఖచ్చితంగా అంచనా వేయడం ఎవరికి సాధ్యం కాదు, కానీ టాలీవుడ్ భారత సినీ వేదికపై ముఖ్యమైన ఆటగాడిగా మారడం మరియు కొన్ని అంశాలలో బాలీవుడ్‌ను కూడా అధిగమించడం సాధ్యమవుతుందనిపిస్తుంది. బాలీవుడ్ అనేది ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమలలో ఒకటి, ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో చిత్రాలను నిర్మిస్తోంది, ఇవి భారతదేశంలోనే కాకుండా అనేక ఇతర దేశాలలో కూడా ప్రసిద్ధి చెందాయి. స్ట్రీమింగ్ సేవల పెరుగుదల మరియు మీడియాలో పెరుగుతున్న ప్రపంచీకరణతో, భారతీయ చలనచిత్రాలు మరియు టీవీ షోలకు ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. అదనంగా, భారతీయ ప్రతిభ హాలీవుడ్లో గుర్తింపు పొందుతోంది. అలాంటి బాలీవుడ్‌కు నేడు టాలీవుడ్ సమఉజ్జి అయ్యింది. ఎలాగంటే ఇటీవల జరిగిన ప్రపంచ టి 20 క్రికెట్లో పసికూనలు అనుకునే ఆఫ్గనిస్తాన్, యూయస్ ఏ వంటి టీంలు ప్రపంచ ఛాంపియన్స్‌ని ఎలా ఎదుర్కొన్నారో అలా అన్నమాట.
టాలీవుడ్ బాలీవుడ్ నుండి వేరుగా ఉండే ప్రత్యేకమైన మరియు ఫ్లేవర్‌ను ఏర్పరుచుకుంది. హిందీ చిత్రాలలో సంగీతం మరియు నృత్యం విలక్షణమైనది మరియు సినిమాల ఆకర్షణను పెంచుతుంది. బాలీవుడ్ ఈ ప్రత్యేకతను ఉపయోగించుకుని, భారతీయ మరియు అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షిస్తూ అధిక, నాణ్యత చిత్రాలను నిర్మించడం కొనసాగిస్తోంది. కానీ టాలీవుడ్ అందుకు భిన్నంగా సంగీతం, నృత్యం, మంచి కధాంశంతో పాటు గ్లోబల్ స్టేజ్ లో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు బాహుబలి, ఆర్ఆర్ఆర్, కె జి ఎఫ్, ఇప్పుడు కల్కి వంటి హాలీవుడ్ స్థాయి సినిమాలను నిర్మిస్తోంది. ఆ విధంగా భవిష్యత్తులో బాలీవుడ్‌తో పోటీపడే అవకాశం ఉంది. సినిమా అనేది ఓ వ్యాపారం అందుకు ప్రేక్షకుడు ఇచ్చే ఆదరణే లాభాలకు నిదర్శనం. సినిమా హిట్టా ఫట్టా అనేది ఫలితాలు తేల్చేది బాక్స్ ఆఫీసులో….. ఒక ప్రాంతీయ చిత్రంగా తెలుగు సినిమా వ్యాపారం జరిగితే, జాతీయ స్థాయిలో వ్యాపారం జరిగేది హిందీ సినిమా కానీ, ఏది ఎక్కువ ఏది తక్కువ అనడానికి ఉదాహరణగా ఓ 20 సినిమాల రికార్డు కలెక్షన్స్ పరిశీలిస్తే హిందీ చిత్రాల రెవిన్యూకి సమీపంలో తెలుగు చిత్రాల కలెక్షన్స్ వున్నాయి. (ఈ దిగువన మేమిచ్చిన చాప్టర్ ని పరిశీలిస్తే అర్ధమౌతుంది). అయితే, టాలీవుడ్ బాలీవుడ్ కంటే ముందంజ వేయడానికి అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది.
చలనచిత్ర పరిశ్రమ ఇప్పటికీ నిధులు, పంపిణీ మరియు పైరసీతో సమస్యలను ఎదుర్కొంటోంది. అదనంగా. బాలీవుడ్ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఉనికిని కలిగి ఉంది, మరియు ప్రపంచ వినోద పరిశ్రమలో ఆధిపత్యం చెలాయించిన సుదీర్ఘ చరిత్రను కూడా కలిగి ఉంది. కాకపోతే… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి వంటి చిత్రాలు ఉత్తమ విలువలతో భారీ బడ్జెట్ తో తెలుగు వాడి చేతిలో రూపకల్పన చేసుకుని ఓవరాల్ గా గ్లోబల్ స్టేజ్ లో తన సత్తాను చాటుకుంది. సమీప భవిష్యత్తులో బాలీవుడ్ ను అధిగమించి హాలీవుడ్ సరసన నిలబడే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా, రెండు పరిశ్రమలు ఒకదానికొకటి నేర్చుకోవచ్చు మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల కోసం గొప్ప వినోదాన్ని అందించడానికి సహకరించుకోవచ్చు.
బాలీవుడ్ అనే హిందీ (హిందుస్థానీ) సినీ పరిశ్రమ
1897లో ప్రొఫెసర్ స్టీవెన్సన్ ఓ చిత్ర ప్రదర్శనలో కలకత్తా స్టార్ థియేటర్లో స్టేజ్ షో గా ప్రదర్శించబడిరది. దాదాసాహెబ్ ఫాల్కే యొక్క మూకీ సినిమా ‘ రాజా హరిశ్చంద్ర’ (1913) భారతదేశంలో నిర్మించిన మొదటి మూకీ చలనచిత్రం అంతే కానీ అది హిందీ చిత్రం కాదు. మొదటి భారతీయ టాకీ చిత్రం, అర్దేషిర్ ఇరానీ యొక్క ఆలం అరా (1931), అది వాణిజ్యపరంగా విజయవంతమైంది. టాకీలు మరియు మ్యూజికల్స్‌కు విపరీతమైన డిమాండ్‌తో, హిందుస్థానీ సినిమా (అప్పట్లో హిందీ సినిమాని అలా పిలిచేవారు) ప్రేరణతో ఇతర ప్రాంతీయ భాషా చలనచిత్ర పరిశ్రమలు కూడా త్వరగా టాకీ చిత్రాల నిర్మాణం ప్రారంభించాయి. 1930 నుండి 1940 దశకంలో భారతదేశం గందరగోళ సమయం, గ్రేట్ డిప్రెషన్, రెండవ ప్రపంచ యుద్ధం, భారత స్వాతంత్య్ర ఉద్యమం మరియు విభజన యొక్క హింసతో కొట్టుమిట్టాడింది.
భారత స్వాతంత్య్ర పోరాటాన్ని తమ చిత్రాలకు నేపథ్యంగా ఉపయోగించుకున్నారు. అర్దేషిర్ ఇరానీ 1937లో ‘కిసాన్ కన్య’ అనే తొలి హిందీ రంగుల చిత్రాన్ని రూపొందించారు. ఈ సమయంలో, విలాసవంతమైన రొమాంటిక్ మ్యూజికల్స్ మెలోడ్రామా వంటి అంశాలతో హిందీ సినీ పరిశ్రమ దేశ వ్యాప్తంగా ప్రసిద్ధికెక్కింది. ఖ్వాజా అహ్మద్ అబ్బాస్ రూపొందించిన ‘దర్తి కె లాల్’ 1946 లో ఓవర్ సీస్ లో విడుదలైన తొలి భారతీయ చిత్రం. ఆ తరువాత బాలీవుడ్ షో మాన్ రాజ్ కపూర్ నిర్మించిన ‘ఆవారా’ 1951 లో రష్యా లో ఈ చిత్రం ప్రదర్శింపబడిరది. అలా భారతీయ చిత్రాల ఓవర్ సీస్ మార్కెట్ ప్రారంభమైంది.
ఇరవై ఏళ్ళ క్రితమే బాలీవుడ్‌ని అధిగమించిన టాలీవుడ్ మార్కెట్
90వ దశకంలోఉత్తమ వంద చిత్రాలలో మొదటి పది పాతాళ భైరవి (1951), మల్లీశ్వరి (1951), దేవదాసు (1953), మాయాబజార్ (1957), నర్తనశాల (1963), మరో చరిత్ర (1978), మా భూమి (1979), శంకరాభరణం (1979), సాగర సంగమం (1983), శివ (1989) వంటి చిత్రాలు మొదటి పది స్థానాలని దక్కించుకొన్నాయని సి ఎన్ ఎన్ – ఐ బి ఎన్ గుర్తించింది. సినిమా అనేది తెలుగు వారి సంస్కృతిలో, జీవితంలో భాగమైపో యింది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ గ్రూప్ చూసినా తెలుగు వాళ్ళు సినిమాల గురించి మాట్లాడకుండా ఉండలేరు. తెలుగు వారికి ఇతర సైటుల కంటే సినిమా సైటులే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం భారతీయ సినిమాలో సంఖ్యాపరంగా, వాణిజ్య పరంగా అత్యధికంగానూ, మొదటి స్థానంలో తెలుగు సినిమా వర్ధిల్లుతోంది. ఇరవై ఏళ్ళ క్రితమే 2004, 2005, 2006, సంవత్సరాలకి గాను తెలుగు సినీ పరిశ్రమ బాలీవుడ్‌ని అధిగ మించి దేశంలోనే అత్యధిక చిత్రాలని నిర్మించింది. 2004 వ సంవత్సరములో ఒక్క సంక్రాంతి సమయం లోనే 150 కోట్లకు వ్యాపారం జరిగినట్టు అంచనా. ఇది బాలీవుడ్ పరిశ్రమ ఆ సంవత్సరంలో అర్జించినదానికన్నా ఎక్కువ. ఆ కాలంలోనే తెలుగు సినిమాకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చెయ్యడానికి ప్రత్యేకంగా మూడు టీవీ ఛానళ్ళు పైనే ఉన్నాయి.
2005 వ సంవత్సరములో సగటున వారానికి రెండు సినిమాలు విడుదల కాగా, 32 బిలియన్ రూపాయల టిక్కెట్టు అమ్మకాల ద్వారా 23 బిలియన్ రూపాయల వార్షిక ఆదాయం వచ్చిందని అంచనా. పెద్ద చిత్రాలు చాలా వరకు పండుగ సమయాలైన సంక్రాంతి, ఉగాది, దసరాలకు లేదా వేసవి సెలవులకు విడుదల చేస్తారు. 2006 లో దాదాపు 245 చిత్రాలు విడుదలయ్యాయి. ఆ సంవత్సరానికి భారతదేశంలోనే ఈ సంఖ్య అత్యధికం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్ళ ట్రెండ్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే రూపాయల్లో 1980లో 819 మిలియన్లు, 1985 లో 1526 మిలియన్లు, 1990లో 3,333 మిలియన్లు, 1995లో 7,985 మిలియన్లు, 2000లో 14,011 మిలియన్లు, 2005లో 23,044 మిలియన్లు, ఒక రకంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేశీయ ఉత్పత్తుల ద్వారా వచ్చే స్థూల ఆదాయంలో 2 శాతం తెలుగు సినిమా పరిశ్రమ నుండి వచ్చింది.
తెలుగులో పాన్ ఇండియా మూవీల నిర్మాణాలు – ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం
తెలుగు సినిమా నిర్మాణ వ్యయం సాధారణంగా ఒక్కో సినిమాకు 7 నుండి 40 కోట్ల మధ్య ఉంటుంది. రిలీజ్‌కి ముందే మంచి బజ్ వున్న చిత్రాలకి 12 నుండి 60 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. సినిమా విజయం సాధిస్తే 60 నుండి 100 కోట్ల వరకు వ్యాపారం జరగోచ్చు. వాణిజ్యపరంగా ఈ అంకెలను కొలమానంగా తీసుకుని, తెలుగు సినిమా దేశవ్యాప్తంగా, ప్రపంచ మార్కెట్లకు విస్తరించి ప్రేక్షకులను ఆకట్టుకుని పాన్ఇండియన్ మూవీలు తెలుగు సినిమాలే అన్నట్లుగా చరిత్రను సృష్టించింది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి భారతీయ సినిమా చరిత్రను మార్చారు. జానపద యాక్షన్ చిత్రాలు బాహుబలి: ది బిగినింగ్ (2015) మరియు బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017) ద్వయంతో పాన్-ఇండియన్ చలనచిత్రాల ఉద్యమానికి మార్గ దర్శకుడుగా నిలిచారని చెప్పొచ్చు. ‘‘పాన్-ఇండియన్ ఫిల్మ్’’ అనే పదం భారతదేశం అంతటా – తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం – బహుళ భాషలలో ఏకకాలంలో మార్కెట్ చేయబడి మరియు విడుదల చేయబడిన చలనచిత్రం కోసం ఉపయోగించబడిరది. ఇటువంటి చలనచిత్రాలు భాషా, ప్రాంతీయ మరియు సాంస్కృతిక అడ్డంకులను అధిగమించి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేసాయి.
బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్ జానపద యాక్షన్ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైంది. చిత్ర నిర్మాతలు ఒక కొత్త చలనచిత్ర ఉద్యమాన్ని ప్రారంభించారు, అంటే ఒకే చిత్రాన్ని వివిధ భాషల్లో రీమేక్ చేయడం కంటే, వారు అదే చిత్రాన్నిఆయా ప్రాంతాల నటి నటులను కలుపుకుని, వివిధ భాషల్లోకి డబ్ చేసి ఒకేసారి విడుదల చేస్తున్నారు. పాన్ఇండియన్ చిత్రాలను మార్కెటింగ్ చేయడంలో తెలుగు సినిమా రాణించిందని జాతీయ స్థాయిలో ఎంతో మంది ఫిల్మ్ క్రిటిక్స్ తమ సమీక్షలు రాశారు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన బాహుబలి 1, 2 ల ట్రెండ్ ను చూసి, కన్నడ పరిశ్రమలో తొలిసారిగా అత్యంత భారీ బడ్జెట్ తో స్టార్ డమ్ లేని యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం కెజిఎఫ్ చాప్టర్ 1 (2018) కూడా ఐదు భాషల్లో విడుదల చేసారు.
తద్వారా కన్నడ సినిమా నుండి మొదటి ప్రధాన పాన్-ఇండియన్ చిత్రంగా నిలిచింది. అదే ఏడాది లో సూపర్ స్టార్ రజనీకాంత్ శంకర్ల తమిళ చిత్రం 2.0 (2018), సాహో (2019), సైరా నరసింహ రెడ్డి (2019) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-ది రైజ్’ 2021, 2022 లో ఎస్ ఎస్ రాజమౌళి-ఎన్టీర్-రామ్ చరణ్ ల ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ చాప్టర్ 2’, ప్రభాస్ ‘రాధే శ్యామ్’, 2023 లో ప్రభాస్ ‘ఆదిపురుష్’, షారుఖ్ ఖాన్-అత్లీ కుమార్ ల ‘జవాన్’, విజయ్-లోకేష్ కనక రాజ్ ల లియో, అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో ఎంటర్ అయ్యి రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ చిత్రం. ఇదే ఏడాది ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ పార్ట్ 1 – సీసెఫైర్, వంటి ఇతర చిత్రాల విజయం పాన్-ఇండియన్ చిత్రాలను ఇతర ప్రధాన భారతీయ చలనచిత్ర పరిశ్రమలకు విస్తృతంగా వ్యాపింపజేసింది. ఇక మలయాళ సినిమా నుండి వచ్చిన మొదటి ప్రధాన పాన్-ఇండియన్ చిత్రం ‘మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’ (2021).
2024లో బాలీవుడ్‌కి ఏమైంది?
బాలీవుడ్ సినిమా 2023లో మంచి విజయాల్ని సాధించింది. జవాన్, పఠాన్,యానిమల్, గదర్ 2, డున్కి, టైగర్ 3 వంటి మొదలైన చిత్రాలు రికార్డు కలెక్షన్స్ సాధించాయి. 2024 ప్రథమార్ధంలో విడుదలైన ఫైటర్, షైతాన్, క్రెవ్,ఆర్టికల్ 370, బడేమియా చోటేమియా, మైదాన్, శ్రీకాంత్ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ముంజేయ అనే చిత్రం వరకు లాభాల చేకూరాయి. ఈ ఏడాది హిందీ చిత్రాలకు ఏ మాత్రం ఆకర్షణ లేకుండా పోయింది. ఈ ఆరు నెలల తరువాత వచ్చాడు ‘కల్కి 2898 ఏ డి’ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి దిగ్గజ నటులు నటించడం దానికి తోడు హాలీవుడ్ సినిమాలకు ధీటుగా నిర్మించడం తో హిందీలో కూడా హైప్ క్రియేట్ అయ్యింది. అవ్వడమే కాదు యానిమల్ , జవాన్ రికార్డు కలెక్షన్స్ మూడు రోజుల్లో తుడిచిపెట్టుకు పోయింది. ఒక్క సారిగా తెలుగు సినిమా పవర్ చూసి బాలీవుడ్ కి మతిపోయింది. ప్రస్తుతం అక్కడి నిర్మాతలు తెలుగు దర్శకులపై, సాంకేతిక నిపుణులపై దృష్ఠి పెడుతున్నారు.
పాన్ వరల్డ్ మూవీగా ప్రభాస్ ‘కల్కి 2898 ఏడి’
కల్కి 2898 ఏ.డీ అనేది పాన్ ఇండియా రేంజ్ దాటి పాన్ వరల్డ్ మూవీ గా 600 కోట్ల రూపాయలతో ఈ సినిమా రూపొందింది. నిర్మాణ బడ్జెట్ లో అత్యంత ఖరీదైన తొలి భారతీయ సినిమా ఇది. పౌరాణిక ఫ్యూచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాగా వైజయంతీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అశ్వనీ దత్ నిర్మించిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది హిందూ పురాణాల నుండి ప్రేరణ పొందిన కల్కి సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటి భాగం. కల్కి 2898 ఏడీలో అపోకలిప్టిక్ అనంతర ప్రపంచ నేపథ్యంలో సెట్ చేయబడిన సినిమా. ల్యాబ్ సబ్జెక్ట్ అయిన సామ్‌కి-80కి చెందిన పుట్టబోయే బిడ్డ కల్కిని రక్షించే లక్ష్యం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. 2024, జూన్ 27న విడుదలైన ఈ చిత్రం ఖండాంతరాలను దాటి ప్రపంచవ్యాప్తంగా 28 భాషల్లో ప్రదర్షింపబడుతుంది. ఈ వ్యాసం రాసేనాటికి కల్కి 2898 ఏడీ విడుదలై 14 రోజులు (10.07.2023) నాటికి 900 కోట్ల రూపాయలు వసూల్ చేసిందని మేకర్స్ తెలియచేసారు. గరిష్టంగా కల్కి 2898 ఏడీ పార్ట్ 1, 2000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని నిర్మాత సి. అశ్వని దత్ ప్రెస్ మీట్లో చెప్పారు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్, కల్కి సినిమాలతో గ్లోబల్ స్టేజ్‌పై నిలబడిన అగ్ర నిర్మాతలు
2009లో గీతా ఆర్ట్స్ బ్యానర్లో, రాజమౌళి భారీ సెట్స్, విఎఫ్ఎక్స్ టెక్నిక్ తో, భారీ బడ్జెట్ తో తీసిన జానపద, సోషియో మూవీ మగధీర. అప్పట్లో ఈ చిత్రానికి అయిన ఖర్చు షుమారు 40 నుండి 44 కోట్లవరకు అయ్యింది. తెలుగులో 2009 జులై 31న విడుదలైన ఈ చిత్రం 130 కోట్ల వరకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ సాధించింది. అయితే ఇతర భాషల్లో డబ్ చేసి విడుదల చేయడానికి సమయం తీసుకున్నా రు. హిందీలో అదే టైటిల్‌తో, తమిళ్ మావీరన్, మరియు ధీర-ది వారియర్ టైటిల్‌తో మలయా ళంలో విడుదల చేసారు. మరి ఇదే సినిమా ఇప్పటి పాన్ ఇండియా మూవీల్లాగా తీసివుంటే పై మూడు చిత్రాల సరసన నిలబడేది. రాజమౌళి తెలుగు సినిమాను గ్లోబల్ స్టేజ్‌పై నిలబెట్టిన ఘనత దక్కుతుంది. బుల్లితెరలో తెలుగు, కన్నడ, ఒరియా భాషల్లో టివి సీరియల్స్ నిర్మాణం చేపట్టిన ఆర్కా మీడియా బ్యానర్లో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ‘వేదం’ సినిమాతో 2010 సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత రాజమౌళితో మర్యాద రామన్న నిర్మాతలుగా, అనగనగా ధీరుడు, పవన్ కళ్యాణ్ పంజా సినిమాలకు కో ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిం చారు. 2015లో బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2, చిత్రాలు నిర్మించి తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఈ చిత్రాల తరువాత ఆర్ కె ఫిలిం అసోసియేట్‌తో ‘పెళ్లి సందడి’ మహాయాన్ మోషన్ పిక్చర్స్ తో ఉమా ‘మహేశ్వర ఉగ్ర రూపస్స్య’ చిత్రాలు విడుదల చేసారు. ప్రస్తుతం సిద్ధార్థ్ నాదెళ్ల దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ లీడ్ క్యారెక్టర్ గా ‘ఆక్సీజెన్’, శశాంక్ యేలేటి దర్శకత్వం లో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే మూవీ అండర్ ప్రొడక్షన్ లో వున్నాయి. 1992లో శ్రీబాలాజీ క్రియేషన్స్ బ్యానర్లో విడుదలైన జంబలకిడిపంబ సినిమా ద్వారా నిర్మాత జై భగవాన్‌తో కలిసి సినీరంగంలోకి అడుగు పెట్టారు. తొలుత యూనివర్సల్ మీడియా పతాకంపై దేశముదురు, వరుడు, కెమరామెన్ గంగ తో, వంటి చిత్రాలను నిర్మించి రాంచరణ్ హీరోగా చేసిన బ్రూస్ లీ చిత్రంతో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ స్థాపించారు. ఆ తరువాత నిన్ను కోరి, భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల తరువాత ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఆస్కార్ లెవల్‌కి వెళ్లగలిగే చిత్రాన్ని అందించారు.
తెలుగు సినిమా చరిత్ర
చలన చిత్రాన్ని కనిపెట్టిన లుమీర్ సోదరులు భారతదేశంలో 1886లో మొదటి మూగ సినిమాను ప్రదర్శించారు. తరువాత ఆర్.జి.టోర్నీ అనే విదేశీయుడు 1910లో ‘‘భక్త పుండరీక’’, 1911లో ‘‘రాజదర్బార్’’ అనే చిత్రాలు నిర్మించాడు. మన భారతీయుడు దాదా సాహెబ్ ఫాల్కే భారత దేశంలో మొదటి మూగ సినిమా ‘‘రాజా హరిశ్చంద్ర’’ నిర్మించారు. ఈ చిత్రం 1913 మే 3న విడుదల చేశాడు. తెలుగు సినిమా వచ్చేసరికి మచిలీపట్నానికి చెందిన రఘుపతి వెంకయ్య, తనకుమారుడైన ఆర్.ఎస్.ప్రకాష్ దర్శకత్వం, నటనలో ‘‘భీష్మ ప్రతిజ్ఞ’’ అనే మూగ సినిమాను నిర్మించి 1921లో విడుదల చేశాడు. మన తెలుగు సినిమాకు ఆద్యుడు రఘుపతి వెంకయ్య. అది మూకీ యూగం.
అయితే అర్దేష్ ఇరానీ నిర్మాతగా 1931లో హిందీ (అలం అరా), తెలుగులో (భక్త ప్రహ్లాద), తమిళ్ లో (కాళిదాస)భాషలలో మూడు టాకీ చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిలో తెలుగు, తమిళ చిత్రాల సారథి హెచ్.ఎమ్.రెడ్డి. సురభి నాటక సమాజం వారి జనప్రియమైన నాటకం ఆధారంగా నిర్మించబడిన ‘భక్త ప్రహ్లాద’ తెలుగులో మొదటి టాకీ సినిమాగా స్థానం సంపాదించుకొంది.
తొలి సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సినిమా 1932 జనవరి 22న సెన్సార్ జరుపుకొని, 1932 ఫిబ్రవరి 6న బొంబాయి లోని కృష్ణా సినిమా థియేటర్ లో విడుదలైంది. సుమారు రెండు నెలల తరువాత, అంటే 1932 ఏప్రిల్ 2న ‘భక్త ప్రహ్లాద’ మద్రాసులో విడుదలైంది. ఆ విధంగా మన తెలుగు సినిమా మన తెలుగు రాష్ట్రాలలో కాకుండా ఇతర రాష్ట్రాలలో విడుదలైంది. కారణం అప్పటికి మన రాష్ట్రంలో విజయవాడ లో వున్న మారుతీ థియేటర్, రాజమండ్రి లో వున్న శ్రీ కృష్ణా పిక్చర్స్ ప్యాలస్ (ప్రస్తుతం శ్రీ సాయి కృష్ణ) సినిమా థియేటర్ల లో ఆడియో సిస్టమ్ లేకపోవడమే! ఆ విధంగా 1931-1940 దశకంలో మొదటి సినిమా ‘భక్త ప్రహ్లాద’తో ప్రారంభమై పౌరాణిక చిత్రాల నుండి ‘విశ్వ మోహిని’ వంటి సామాజికి చిత్రాలు వంటివి మొత్తం 76 తెలుగు సినిమాలు వచ్చాయి.
1940 లో విడుదలైన విశ్వమోహిని భారతీయ చలనచిత్ర రంగానికి ప్రాతినిధ్యం వహించిన తొలి చిత్రం. ఆసియా పసిఫిక్ సినిమా మహోత్సవం వంటి అంతర్జాతీయ సినిమా మహోత్సవాలలో ప్రదర్శింపబడ్డ మొదటి తెలుగు సినిమా 1951 లో విడుదలైన మల్లీశ్వరి. ఈ చిత్రం చైనా లోనూ 13 ప్రింట్లతో చైనీస్ సబ్-టైటిళ్ళతో బీజింగ్ లో 1953 మార్చి 14 లో విడుదలైనది. 1951 లో విడుదలైన ‘పాతాళ భైరవి’ 1952 జనవరి 24 న బొంబాయిలో జరిగిన మొట్టమొదటి భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ప్రదర్శింపబడిన మొట్టమొదటి దక్షిణ భారత చలన చిత్రం. ఆ విధంగా మన తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
వైజయంతి మూవీస్
మహానటుడు విశ్వ విఖ్యాత నటసార్వ భౌముడు నందమూరి తారక రామరావుతో 1974లో వైజయంతి మూవీస్ సంస్థను స్థాపించి ‘ఎదురులేని మనిషి’ చిత్రం ద్వారా సినీ రంగంలోకి ప్రవేశిం చారు చలసాని అశ్వని దత్, అంతే కాకుండా తన కుమార్తెలు స్వప్న సినిమా, త్రి ఏంజెల్స్ స్టూడియో అనే బ్యానర్ పై పలు చిత్రాలు నిర్మించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అగ్ర హీరోలందరూ నటించారు. తెలుగు సినీరంగంలో అగ్ర నిర్మాణ సంస్థగా ఈ బ్యానర్ లో గోల్డెన్ జుబిలీ జరుపుకుంటున్న శుభ సందర్భంలో ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వం లో 30వ చిత్రంగా ‘కల్కి 2898 ఎ డి’ రూపుదిద్దుకుంది. 2024, జూన్ 27న విడుదలైన ఈ చిత్రం ఖండాంతరాలను దాటి ప్రపంచవ్యాప్తంగా 28 భాషల్లో ప్రదర్శించారు. గరిష్టంగా కల్కి 2898 ఏడీ పార్ట్ 1, 2000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని నిర్మాత సి. అశ్వని దత్ ప్రెస్ మీట్ లో చెప్పారు. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ లు ఒక ఎత్తు అయితే ఈ చిత్రం ఒక ఎత్తు. పురాణాల నుండి ప్రేరణ పొందిన కల్కి అవతార కథను సినిమాటిక్ యూనివర్స్‌లో మిక్స్ చేసి హాలీవుడ్ రేంజ్ లో నిర్మించి తెలుగు సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లిన నిర్మాత సి. అశ్వని దత్ కు హాట్స్ ఆఫ్.
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులలో తెలుగు సినిమా
ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న తెలుగు సినిమా, ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే! అయితే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రికార్డులకు నిఘంటువుగా నిలిచిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులలో పలుమార్లు మన తెలుగు సినిమా, తెలుగు సినిమా సభ్యులు చరిత్ర లిఖించారు. వాటిని ఒకసారి గుర్తు చేసుకుందాం…
* ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో గా రామోజీ ఫిలిం సిటీ గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది. దాదాపు 1700ఎకరాల సువిశాలమైన నిర్మాణంలో ఎన్నో వేల సినిమా లకు ఈ ఫిలింసిటీ బాసటగా నిలిచింది. స్క్రిప్ట్ తో లోపలి వెళ్తే ఫైనల్ కాపీతో బయటకు వచ్చే అన్ని టెక్నాలజీలు ఇందులో వుండడం విశేషం.
* సినిమా రంగానికి సంబంధించి దాదాపు 130 సినిమాలను ఒకే వ్యక్తి నిర్మించడం ఘనమైన రికార్డుగా పేర్కొంటున్నారు. మూవీ మొఘల్ డి. రామానాయుడుగారు ఈ రికార్డుని నెలకొలిపి చరిత్రలో నిలిచారు. దేశంలో మాట్లాడే ప్రధాన బాషలన్నింటిలో సినిమా తీయాలన్నది ఆయన కల చాల వరకు నెరవేరింది.
* ఒకే గళం నుండి కొన్ని వేల సంఖ్యలో పాటలు రావడం, అవి సినిమా పాటలు కావడం అత్యంత అరుదు. ఈ అరుదైన అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన గాన గంధర్వుడు ఎస్ పి బాలసుబ్రమణ్యాన్ని గిన్నిస్ బుక్ తనలోకి ఎంట్రీ ఇచ్చి పులకించిపోయింది.
* ఆడది వ్యక్తి కాదు ఒక శక్తి అని నిరూపించిన లేడీ డైనమిక్ డైరెక్టర్ విజయనిర్మల. ఈమె తప్ప ప్రపంచంలో మరే లేడీ డైరెక్టర్ అన్ని సినిమాలకు దర్శకత్వం వహించకపోవడం విశేషం.
* ఎక్కువ సినిమాలకి (వివిధ భాషలలో) 151 సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు దాసరి నారాయణరావు ఏకైక దర్శకుడిగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించారు.
* సంచలనం సృష్టించిన బాహుబలి సినిమాకి సంబంధించిన అతిపెద్ద పోస్టర్ని కేరళలో ప్రదర్శించి గిన్నిస్ బుక్‌లో స్థానం కొట్టేశారు.
* తక్కువ కాలంలో 860లకు పైగా సినిమాలలో నటించి ఇప్పట్లో ఎవరూ చెరపలేని రికార్డుని స్థాపించారు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం. బ్రాహ్మి వుంటే సినిమా హిట్ అనే రేంజ్‌కి చేరుకున్న ఈ అరగుండుకి గిన్నిస్ సాదర స్థానం అందించింది.