సినిమా నైపుణ్యం మరియు సాంకేతిక ఆవిష్కరణల గురించి తెలియజేసేందుకు హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఏర్పాటుచేసిన సినిమాటిక్స్ ఎక్స్‌పో కార్యక్రమం ముగిసింది. ముగింపు వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సినిమాటిక్స్ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన పలు రంగాల సాంకేతికతను తిలకించి నిర్వాహకులను ప్రశంసించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీ రంగానికి విశేష సేవలందించిన పలువురు దిగ్గజాలకు సినీ హీరో సుధీర్‌బాబు, పీజీ విందా చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ గ్రూప్స్ చైర్మన్ రమేష్ ప్రసాద్‌కు సినిమాటిక్ ఎక్స్‌పో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేశారు. అనంతరం రెండు మిలియన్లకు పైగా ఆన్‌లైన్ ఓటింగ్‌తో ఫ్యాషన్, టెక్, ఫుడ్ వంటి 15 రంగాల్లో అసాధారణమైన కంటెంట్‌ను సృష్టించిన వారికి తెలుగు డీఎంఎఫ్ క్రియేటర్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ సంస్థ అవార్డులను అందించింది. ఈ సందర్భంగా సుదీప్ ఛటర్జీ, సత్యాంశు సింగ్, ఇంద్రగంటి మోహన కష్ణ వంటి ప్రముఖ వక్తలు.. స్టోరీ టెల్లింగ్, సినిమాటోగ్రఫీ మరియు సినిమాల్లో సాంకేతిక పురోగతి వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమాన్ని సినీ దిగ్గజాలు రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగా, కె.కె. సెంథిల్ కుమార్ సహా పలువురు ప్రముఖల చేత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సినిమాటిక్స్ ఎక్స్‌పోకు అపూర్వ స్పందన వచ్చిందని భవిష్యత్‌లో తాము ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు.