భారత టెకీల్లో మొదలైన కలవరం

కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిది. దాని మూలంగా ఐటీ రంగంలో అవకాశాలు వెల్లువెత్తాయి. డిజిటలైజేషన్కు ప్రాధాన్యం పెరిగింది. వేతనాల్లోనూ భారీ పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా భారత్లోని టెక్ కంపెనీల్లో నియామకాలు గణనీయంగా పెరిగాయి. ఇదంతా గత రెండేండ్ల కాలంలో జరిగిన పరిణామాలు. అయితే ఆర్థిక మాంద్యం సంకేతంతో ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు పక్రియ మొదలైంది. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఉద్యోగులను భారీగా తొలగిస్తుండటం తీవ్ర కలవరం రేపుతున్నది. మైక్రోసాఫ్ట్ 10 వేలు, అమెజాన్ 18 వేలు, గూగుల్ 12 వేల మంది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టగా, 452 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తాజాగా విప్రో కూడా ప్రకటించింది.

బడా కంపెనీలే ఈ తొలగింపు చేపట్టడంతో దీనికి ఆర్థిక మాంద్యం కారణమనే అభిప్రాయాన్ని ఆర్థిక నిపుణుడు డీ పాపారావు వ్యక్తం చేశారు.ఆర్థిక మాంద్యం ప్రభావం ఒక్క ఐటీపైనే కాదు అన్ని రంగాలపైనా ఉంటుంది. ముఖ్యంగా ఉత్పత్తి రంగంపై ఎక్కువగా ఉంటుంది. ప్రజల కొనుగోలు సామర్థ్యం తగ్గిపోతుంది. ఉన్న దాన్ని భద్రంగా దాచుకొని కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని పాపారావు వివరించారు. కరోనా దెబ్బకు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు విలవిలలాడాయి. ఇప్పటికీ కొన్ని దేశాల్లో ప్రభావం ఉన్నది. భారత్ ఇందుకు మినహాయింపు కాదు. ఇటీవలి అంచనాల ప్రకారం మన దేశ జీడీపీ వృద్ధి -7.3% గా నమోదైంది. తీవ్రమైన ఆర్థిక మాంద్యంలో ఉన్నామని స్పష్టమవుతున్నదని నిపుణులు చెప్తున్నారు.

Related Posts

Latest News Updates