బ్రిటన్ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖితమైంది. తొలిసారిగా ఆ దేశ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఎన్నికయ్యారు. మెజారిటీ పార్లమెంటు సభ్యుల (188 మంది) మద్దతు లభించడంతో ఆయనను ప్రధానిగా, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ప్రకటించారు. దీంతో సరికొత్త రికార్డు నెలకొల్పారు.
ముందు నుంచి కూడా రిషి సునాక్ కు హిందూ మూలాలపై, సంప్రదాయంపై ఎనలేని ఆసక్తి. యార్క్ షైర్ ఎంపీగా బ్రిటన్ పార్లమెంట్ లో పదవీ స్వీకారం చేసే సమయంలో భగవద్గీతపై ప్రమాణం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. రిషి సునాక్ తల్లిదండ్రులు భారత సంతతికి చెందిన వారు. 1960 లో తూర్పు ఆఫ్రికా నుంచి వీరిద్దరూ యూకేకి వలస వెళ్లారు. పంజాబ్ మూలాలున్న రిషి… పూర్వీకులు ఆఫ్రికాకు వెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ బ్రిటన్ చేరుకున్నారు.
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడే…
రిషి సునాక్ మే 12, 1980 న ఇంగ్లాండ్ లో ఉషా సునాక్, యశ్వీర్ సునాక్ కు జన్మించారు. రిషి విద్యాభ్యాసం చాలావరకు బ్రిటన్ లోనే జరిగింది. ఉన్నత విద్య కోసం అమెరికాలోని స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లిన ఆయనకు నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తి పరిచయమయ్యారు. ఇద్దరి స్నేహం ప్రేమగా మారడంతో 2009 బెంగళూరులో పెద్దల సమక్షంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. రిషి, అక్షత దంపతులకు ఇద్దరు కూతుళ్లు.. 11 ఏళ్ల కృష్ణ, 9 ఏళ్ల అనౌష్క.