ప్రపంచ ప్రఖ్యాత యానిమేషన్, విఎఫ్‌ఎక్స్, గేమింగ్ రంగాలకు సంబంధించిన టెక్నాలజీ, టెక్నీషియన్స్‌ను ఒకటే చోటికి చేర్చి సందర్శకులకు పరిచయం చేసే ఇండియాజాయ్ మరియు సినిమాటికా ఎక్స్ పో మరోసారి అలరించడానికి సిద్దమైంది. గతేడాది ఆవిష్కరించిన అంతర్జాతీయ ప్రదర్శనకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ సహా పలువురు ప్రముఖుల నుంచి అనూహ్య స్పందన లభించడంతో ఈ ఏడాది సినిమాటికా ఎక్స్‌పో 2వ ఎడిషన్‌ను నవంబర్ 16, 17 తేదీలలో హెచ్.ఐ.సి.సి నోవోటెల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ఐటి శాఖ సహకారంతో.. సినిమా, టెక్నాలజీ, సృజనాత్మకత వంటి అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రపంచ ప్రఖ్యాత విజువల్ ఎఫెక్ట్స్ టెక్నీషయన్లను, ఫిలింమేకర్లను, సోనీ-యారీ-రెడ్ తదితర టెక్నాలజీ కంపెనీలకు చెందిన ప్రతినిధులను ఒకే చోట కలుసుకోవడానికి ఈ ఎక్స్‌పో వేదిక కానుంది. 2023లో జరిగిన సినిమాటికా ఎక్స్‌పోలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున, ‘కల్కీ’ డైరెక్టర్ నాగ్ అశ్విన్, ‘బాహుబలి-ఆర్ఆర్ఆర్’ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్, తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీజీ విందాతో సహా పలువురు సినీ ప్రముఖులు, టెక్నీషియన్స్ హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ ఈవెంట్‌లో అత్యాధునిక సినిమా పరికరాలు, సాఫ్ట్‌వేర్‌లను ప్రదర్శనకు ఉంచడంతోపాటు, సెమినార్‌లు, ఇంటరాక్టివ్ సెషన్‌లు, కొత్త ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ అలరించనున్నాయి. సినీరంగానికి చెందిన యువ దర్శక నిర్మాతలు, విద్యార్థులు, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్ ఇండస్ట్రీకి చెందిన వారికి ఈ ఈవెంట్ కు విచ్చేయడంతో ఎన్నో నూతన విషయాలపై అవగాహన కలుగుతుంది. ఈ ఎక్స్‌పోకు దాదాపు 30వేల మంది హాజరవ్వడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి.
మరొక విశేషం ఏంటంటే.. గ్లోబల్ తెలుగు కంటెంట్ క్రియేటర్స్ మరియు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కమ్యూనిటీ, తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ (తెలుగు డీఎంఎఫ్).. సినిమాటికాతో కలసి, టెక్ దిగ్గజాలు మరియు కంటెంట్ క్రియేటర్ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి చొరవ తీసుకుంది. దీనిలో భాగంగా కంటెంట్ క్రియేటర్ల నైపుణ్యాన్ని పెంపొందించడానికి కావల్సిన వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు తెలుగు డిఎంఎఫ్ నిర్వహించనుంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రియేటర్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఇండస్ట్రీ ఎదుగుదలతో కీలక పాత్ర పోషిస్తున్నందున వారిని మరింత ప్రోత్సహించడానికి ‘క్రియేటర్స్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవార్డ్స్ 2024’ ని కూడా ఇదే వేదిక నుంచి ప్రధానం చేయనున్నారు. నేడు ఘనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు రాంగోపాల్ వర్మ గారు, సందీప్ రెడ్డి వంగ గారు మరియు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ ఆర్జీవి మాట్లాడుతూ : ముందుగా నన్ను కార్యక్రమానికి ఆహ్వానించిన సినిమా ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు. నేను మొదలు పెట్టినప్పుడు సినిమా వేరు ప్రస్తుతం సినిమా వేరు. సినిమాకి సంబంధించిన విజువల్స్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మారుతూ వచ్చాయి. సెంథిల్ చెప్పినట్టు ఇండియన్ సినిమా పెద్ద హైట్స్ చూస్తోంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు కొత్తదనంతో ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఈ సినిమాటిక ఎక్స్పో సినిమా మీద పాషన్ తో వచ్చే ఎంతోమందికి ఒక మంచి వర్క్ షాప్ లాంటిది. ఇది ఇంత గ్రాండ్ స్కేల్లో ఆర్గనైజ్ చేస్తున్న టీం కి అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ : నేను ఈ ఈవెంట్ కి కేవలం ఆర్జీవి గారి కోసమే వచ్చాను. కానీ ఈవెంట్ ఇంత గ్రాండ్ గా ఉంటుంది అనుకోలేదు. ఈ సినిమాటిక ఎక్స్పో 2వ ఎడిషన్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ : ఈ సినిమాటిక ఎక్స్పో ప్లాట్ఫారం ఎంతోమందికి ఇన్నోవేటివ్ గా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఫ్యూచర్లో సినిమాని ఇంకా గ్రాండ్ గా తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. ఈవెంట్ కి ఆర్జీవి గారు సందీప్ రెడ్డి వంగ గారు రావడం చాలా ఆనందంగా ఉంది. కచ్చితంగా ఈవెంట్ ని అందరూ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.