కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చేసింది. అధ్యక్ష ఎన్నికల కోసం ముగ్గురు నేతలు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఒకరు శశి థరూర్, మరొకరు మల్లికార్జున ఖర్గే కాగా.. చివరి వ్యక్తి జార్ఖండ్ నేత కేఎన్ త్రిపాఠి. ఈ ముగ్గురూ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుసూదన్ మిస్త్రీకి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇక.. తన నామినేషన్ పత్రాలను సమర్పించే ముందు శశి థరూర్ మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.
కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థాపక మూలస్తంభంగా గాంధీ కుటుంబం ఎప్పటికీ కొనసాగుతుందన్నారు. ఆ కుటుంబమే పార్టీకి నైతిక బలమన్నారు. కాంగ్రెస్ డీఎన్ కు, గాంధీ కుటుంబ డీఎన్ఏకు సంబంధం వుందన్నారు. ఇక.. పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున ఖర్గే కూడా తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ పత్రాలపై దిగ్విజయ్ సింగ్ సంతకం చేశారు. అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తున్నట్లు గెహ్లాట్ కూడా ప్రకటించారు.