నటుడు కైకాల మృతిపై ప్రముఖుల సంతాపం

వైవిధ్య నటుడు కైకాల సత్యనారాయణ మృతిపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ సినీ నటులు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. కైకాల సత్యనారాయణ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్య నటన ద్వారా, మూడు తరాల తెలుగు ప్రేక్షుకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తు చేశారు. తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని, వారి కుటుంబీకులుకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ ట్వీట్ చేశారు.

ఇక.. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా కైకాల మృతి పట్ల సంతాపం ప్రకటించారు. పురాణాల నుంచి క్రైమ్ థ్రిల్లర్స్ వరకూ స్పష్టమైన వ్యక్తీకరణలతో విభిన్న పాత్రలను అలవోకగా పోషించిన మహోన్నత వ్యక్తి కైకాల అని వివరించారు. నటుడిగా దీర్ఘకాలం సేవలందించిన కైకాలది తెలుగు చిత్ర సీమలో ప్రత్యేక స్థానం అంటూ కొనియాడారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని, కైకాల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఇక… టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. విభిన్న పాత్రలో నటించి, విలక్షణ నటనతో అభిమానుల చేత నవరస నటా సార్వభౌమ అనిపించుకున్నారని పేర్కొన్నారు. సినీ జీవితంలో ఎన్టీఆర్ గారితో ఆయనకున్న అనుబంధం సొంత అన్నదమ్ముల బంధం కన్నా ఎక్కువ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల మంత్రి హరీశ్‌ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సుమారు 800 సినిమాలలో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి నవరస నటసార్వభౌముడిగా తెలుగు‌చలన చిత్ర పరిశ్రమలో వెలుగొందారని కొనియాడారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు, అభిమానులకు తీరని లోటని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కైకాల సత్యనారాయణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

Related Posts

Latest News Updates