తెలంగాణలోనూ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. టీడీపీ హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్డర్స్ లోనే పుట్టిందని గుర్తు చేశారు. టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. పార్టీకి తెలంగాణలోనూ పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ చారిత్రక అవసరం.. తెలంగాణకూ ఉందన్నారు. అందుకోసం కష్టపడి పనిచేయాలని తెలంగాణ నేతలకు సూచించారు. ఇప్పటికే పార్టీ మొదలుపెట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం బాగా జరుగుతోందని, తెలంగాణ టీం బాగా పనిచేస్తోందని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు. ఎన్టీఆర్‌ జన్మించి వందేళ్లు అవుతున్న సందర్భంగా శతజయంతి ఉత్సవాలు జరుపుకొంటున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా వంద సభలు ఏర్పాటు చేస్తున్నామని, ఆవిర్భావ సభ మొదటిది కాగా, వందో సభ (మహానాడు)ను రాజమండ్రిలో నిర్వహిస్తామని ప్రకటించారు. జయంతి ఉత్సవాలను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ చేయాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వంద రూపాయల వెండి నాణేలను ఎన్టీఆర్‌ గౌరవానికి చిహ్నంగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుజాతి చరిత్ర అని, ఇందులో 10 కోట్ల మంది తెలుగువారు ఉన్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించింది డబ్బు కోసం కాదని, కేవలం తెలుగుజాతి రుణం తీర్చుకోవడానికేనని తెలిపారు. తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్‌ పేరు, తెలుగుదేశం పార్టీ ఉంటాయని అన్నారు.

హైదరాబాద్ లో తాను ప్రారంభించిన కార్యక్రమాలు, ప్రాజెక్టులన్నీ తన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కొనసాగించారని పేర్కొన్నారు. దానికి కేసీఆర్ సహా అందర్నీ అభినందిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. హైటెక్ సిటీ తానే కట్టానని, వైఎస్ దాన్ని కూల్చేస్తే.. హైదరాబాద్ అభివృద్ధి జరిగేదా? అని ప్రశ్నించారు.

 

అవుటర్ రింగ్ రోడ్డును రద్దు చేసి వుంటే… హైదరాబాద్ కి ఈ వైభవం వచ్చేదా? జీనోమ్ వ్యాలీ వల్ల తనకు పేరు వస్తుందని దాన్ని ఆపేస్తే, ఈ రోజు కోవిడ్ కి వ్యాక్సిన్ తయారు చేయగలిగేవారమా? అంటూ ప్రశ్నించారు. ఈ రోజు శంషాబాద్ విమానాశ్రయాన్ని తానే అభివృధ్ధి చేశానని ఎవరూ చెప్పకపోవచ్చని, కానీ… మనస్సాక్షిగా పనిచేశానని చెప్పుకొచ్చారు. అతి కష్టం మీద బిల్ గేట్స్ అపాయింట్ మెంట్ తీసుకొని మాట్లాడి… ఆయన్ను ఒప్పించి హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ డెవలప్ మెంట్ సెంటర్ పెట్టేలా చేశానని గుర్తు చేశారు. తెలుగు జాతి కోసమే ఇదంతా చేశానని తాను గర్వపడుతున్నట్లు ప్రకటించారు.