“తెలుగుభాష వర్తమాన స్థితి- మన కర్తవ్యం”
– డా. సగిలి సుధారాణి
“తెలుగును నిలపడానికి ఉపాధ్యాయులు తెలుగు భాష కోసం కృషి చేస్తున్నారని వారే సాంస్కృతిక వారధులు” అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి రమణాచారి గారు ఈ సదస్సు చెయ్యడానికి సంకల్పించారు.
తెలంగాణ సారస్వత పరిషత్తు – తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో దేవులపల్లి రామానుజరావు కళామందిరం వేదికపై -తెలుగు భాషోపాధ్యాయుల సమ్మేళనం – ఇతివృత్తం –“తెలుగుభాష వర్తమాన స్థితి- మన కర్తవ్యం”-అనే అంశంపై నాలుగు సదస్సులు జరిగాయి. ఇందులో రాష్ట్రం నలుమూలల నుండి 200మంది ఉపాధ్యాయులు ప్రతినిధులు పాల్గొన్నారు. అందులో కొందరు వక్తలుగా పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
డా. జుర్రు చెన్నయ్యగారు స్వాగతోపన్యాసం చేస్తూ అతిధులను సాదరంగా వేదికపైకి ఆహ్వానించారు.
సదస్సు ప్రారంభోత్సవం చిరంజీవి మనోజ్ఞ సరస్వతి ప్రార్థనగీతంతో ప్రారంభం అయినది.అతిథులచే జ్యోతి ప్రకాశం చేసిన అనంతరం సభాధ్యుక్షులు, తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డిగారు మాట్లాడుతూ “ఉపాధ్యాయులే సమాజానికి అసలుసిసలైన మార్గదర్శులు!” అని పేర్కొన్నారు. నోబుల్ బహుమతి ప్రధానం చేసేప్పుడు ఎంతపెద్దవారి గురించైనా రెండు నిముషాల సమయంలోపలే వారిగురించి చెప్పాలి. వచ్చిన ఉపాధ్యాయులు కూడా దానిని దృష్టిలో పెట్టుకొని సమయపాలన పాఠించాలని సూచించారు.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా. కె. వి. రమణాచారి గారు విద్య ఎప్పుడూ నిర్బంధ విద్య కాకూడదని ఆంగ్లమాధ్యమంలో నేర్చుకొనే వారిని నేర్చుకోనివ్వండి! అలాగే తెలుగు మాధ్యమంలో నేర్చుకొనేవారిని ప్రోత్సహించాలని అన్నారు. తెలుగుభాషను సంరక్షించుకోవసిన బాధ్యత మనందరిపైనా ఉందని ప్రభుత్వపరంగా తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు.
తెలంగాణ ఉద్యమం తెలుగుభాష నుండే రూపు దాల్చిందని ఆత్మీయఅతిథిగా విచ్చేసిన తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు జూలూరి గౌరి శంకర్ గారు అన్నారు. జానపద పాటలు, రామాయణ,మహాభారత కథలు జానపదుల పుక్కిట నిలచిఉన్నాయని గుర్తుచేశారు. “మావూరు ముచ్చట్లు” కార్యక్రమం ద్వారా 5 లక్షల మంది విద్యార్థులచే వ్యాసాలు వ్రాసి అందిపజేసిన ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.
ఈ సభకు గౌరవ అతిథిగా విచ్చేసిన అధికార భాషసంఘం అధ్యక్షులు శ్రీమతి మంత్రి శ్రీదేవిగారు మాట్లాడుతూ “వైద్యులైనా, ఇంజనీర్లైనా , ఐ. ఎ. ఎస్ అధికారులైనా, ఈ దేశనాయకులైనా రూపుదిద్దేది ఉపాధ్యాయులే!” అని కొనియాడారు.
మరో గౌరవ అతిథిగా విచ్చేసిన ఆచార్య మనస చెన్నప్పగారు ప్రసంగిస్తూ “భాషప్రియులు ఉన్నంతవరకు, భాషను ఆదరించేవారు ఉన్నంతవరకు తెలుగుభాషకు ఎటువంటి ఢోకా ఉండదని” అన్నారు. అలాగే తెలుగులో నిర్వహించే ప్రాధమిక, మాధ్యమిక పరీక్షలు విద్యార్ధులచే రాయించాలని ఉపాధ్యాయులనుకోరారు.
అనుకోని అతిథిగా అలనాటి తెలుగు పంతుల వస్త్రధారణతో విచ్చేసిన పెద్దలు శ్రీ పారుపల్లి కోదండ రామయ్యగారు ప్రసంగిస్తూఫోను నెంబరును తెలుగు లో చెప్పవలసినది గా సూచించారు. “ఓకె వద్దు సరే ముద్దు! తెలుగుపాటను కాపాడుకొందాం! తెలుగుమాటను మాట్లాడుకొందామని”, నినదించడమే గాక వచ్చిన సభాసదులచేకూడా పలికించారు.
• ఇతర రాష్ట్రాలలో ఉన్న ఇతరభాషలవాళ్ళు ఉన్నప్పుడు తప్పకుండా స్థానిక భాషను అభ్యసించాలి. కానీ మన దగ్గర ఆపరిస్థితి భిన్నంగా ఉంది.
మొదటి సదస్సు- తెలుగు భాష బోధన ప్రస్తుత స్థితి – సమీక్ష
దాసోజు పద్మావతిగారు మాట్లాడుతూ “1.వ తరగతి నుండి 10 తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదివితే విద్యార్ధి భవితకు గట్టి పునాది ఏర్పడుతుంది” అని అన్నారు. వీరి అధ్యక్షతన శేత్పల్లి వెంకటేశ్వర్లు, డా. సగిలి సుధారాణి, గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ, ఋషి నరసింహ, సిరినేని ఉమ, బి. చెన్నారావు , మూర్తి శ్రీదేవిగారు వక్తలు ప్రసంగించారు.
1. ఇంట గెలిచి రచ్చ గెలవాలి!ముందుగా తల్లిదండ్రులలో మార్పురావాలి.
2. “తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యార్ధులు తెలుగు మాథ్యమంలో చదివితే కొన్ని
రాయితీలను ప్రకటించాలి.
3. తెలుగును ఆప్షనల్ సబ్జక్ట్ గా స్వీకరించిన వారికి వేటేజీ మార్కులను ఇతర సబ్జెక్టులకు సరిసమానంగా మార్కులు ఇవ్వాలి.
4. విద్యార్ధులకు లేఖనం, పఠనం తప్పనిసరిగా చెయ్యాలి.
5. విద్యార్ధులకు పాఠాలతో పాటు జీవన పాఠాలు నేర్పించాలి.
6. మారు మూల గ్రామీణప్రాంత విద్యార్థులకు తెలుగు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలి.
7. అంత్యప్రాసలతో కూడిన కవిత్వరూపంలో చెబితే విద్యార్థులకు తెలుగుభాషపై ఆసక్తితో నేర్చుకోవడానికి ముందుకు వస్తారు.
8. ద్వితీయభాషగా తెలుగును నేర్చుకొనే విద్యార్ధులకు తెలుగు అర్ధమవ్వడానికి ఆంగ్లపదాలను ఉదహరించవలసిన పరిస్థితి నెలకొంది.దీనిని అధిగమించాలంటే తల్లిందండ్రులు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. వారు ఇంట్లో పిల్లలతో తప్పనిసరిగా తెలుగులోనే మాట్లాడాలి.
9. తల్లిభాష తల్లికోడివంటిది! దాని వెంట ఇతరభాషలైనపిల్లకోళ్ళు వాటంతట అవే నడచి వచ్చేస్తాయి.
10. తెలుగుభాషను బోధించే ఉపాధ్యాయులను తోటి ఉపాధ్యాయులే చులకనగా చూస్తున్నారని వాపోయారు.
*బతక లేక బడిపంతులు కాదు! బతుకును చూపేవాడే బడిపంతులు!
మధ్యాహ్నం భోజనాంతరం 2. గం.లకు రెండవ సదస్సు ఆరంభమైనది.
2. వ సదస్సు- మారిన పరిస్థితుల్లో బోధనలో కొత్త పద్ధతులు
డా. కాసర్ల నరేశ్ రావుగారుసదస్సు అధ్యక్షోపన్యాసం చేస్తూ“ఆంగ్లభాషపై ఆసక్తి పద్యపఠనం పట్ల నిర్లిప్తత విద్యార్ధులలో ఏర్పుడుతోంది. దానిని అధిగమించే చర్యలు చేపట్టాలి” అని అన్నారు. మండల స్వామిగారు సమావేశకర్తగా వ్యవహరించగా శ్రీమతి జి. అరుణ, టి. సరస్వతి, శ్రీ వెంకటేశ్వరులు, శ్రీ ముదిగొండ సంతోష్, డా. వేముల సత్యనారాయణ, శ్రీ పూదత్తు కృష్ణమోహన్, పి. రమేశ్ వక్తలుగా తమతమ భావాలను పాలుపంచుకొన్నారు.
1. కరోనా పరిస్థితుల మూలంగా విద్యావిధానంలో విద్యార్ధుల చేతికి సెల్‌ఫోన్ ఇవ్వడం కారణంగా “కోతికి కొబ్బరికాయ ఇచ్చిన చందాన” తయారయ్యారని,దానిని అధిగమించి వారిని తమ పొత్తిళ్ళలోనికి ఉపాధ్యాయులు తీసుకోవాలని సూచించారు.
2. పాఠ్య పుస్తకం వారి బంగారు భవితకు చేయుతనివ్వాలి.
3. పద్యపఠనం చేస్తే ఒక తాయిలం ఇవ్వాలి. దీనివలన విద్యార్ధులలో పద్యపఠనాశక్తి మెరుగు పడ్తుంది.
4. ఇంటిపాఠం వారి అభిరుచికి అనుగుణంగా ఇస్తే ఆసక్తిగా చేస్తారు.
5. విద్యార్ధులకు సరైన హాజరు శాతం లేకపోయినా పై తరగతులకు పంపుతున్నారు. దీనిపై దృష్టి సారించాలి.
6. ప్రతి విద్యార్ధికి తెలుగులో చదవడం, రాయడం నేర్పాలి!ఈ- పుస్తకాలను వారికి పరిచయం చెయ్యాలి.
7. “తమ బిడ్డలకు తెలుగు చెప్పకండి! ఇంగిలీసు లోనే చెప్పండి!” అని చెప్పే తల్లిదండ్రుల ధోరణిలో ముందు మార్పును తీసుకొని రావాలి.
8. చదువులో వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి,33జిల్లాలనుండి 33మంది విద్యార్ధులను తనకు అప్పజెబితే వారిని తనబోధనతో మెరుగుపరుస్తానని టి. సరస్వతి గారు సవాలు విసిరారు.
9. టీచర్ల వృత్తి – ప్రవృత్తి రెండూ ఒక్కటే అయ్యుండాలి. నిఘంటువులు టీచర్ల దగ్గర తప్పకుండా ఉండాలి. వాటిని విద్యార్ధులకు కూడా పరిచయం చెయ్యాలి.
10. ఆధునిక బోధన పద్ధతులు అవలంభించాలి. విద్యార్ధుల మధ్య పోటీతత్త్వం కాకుండా సహకార తత్త్వాన్ని పెంపొందించాలి.
11. విద్యార్థులను “చేరుకోవడానికి, చేరువవ్వడానికి” చాలా తేడా ఉంది. మార్కులకోసం కాకుండా మార్పుల కోసం ప్రయత్నం చెయ్యాలి.
12. మన భాష మనతోనే ఉంటుంది.
13. తెలుగు భాషనేర్చుకొంటే ఉపాధి ఏముంటుందని భావించే విద్యార్థులకు “జీతం లక్షరూపాయలు తీసుకొంటున్న మా జీవితమే ఉదాహరణ!” అని ఉపాధ్యాయుడు చెప్పగలగాలి. టి. కృష్ణమోహన్ గారుమాట్లాడుతూ విద్యార్ధులతో “మీనాన్న పొద్దున నుండి పాలుపోస్తే 300 రూ.లు వస్తాయి. నువ్వు తెలుగులో డి.టి.పి నేర్చుకొని రోజుకు 3,000 రూ.లు సంపాదించే ఉపాధిమార్గాలున్నాయని” చెబుతారంట!
14. అంతర్జాలంలో గూగులమ్మ ఒడిలో “ఆంధ్రభారతి వెబ్‌సైట్” ద్వారా తెలుగుభాష బోధన ద్వారా అందిస్తున్నారు. ఇందులోవిద్యార్ధులకు ఉపయోగపడే వచన,పద్య, కథలు, పాటలు ఎన్నో నిక్షిప్తమై ఉన్నాయి.
మూడవ సదస్సు –“విద్యార్ధులలో సృజనాత్మక నైపుణ్యాలు”
ఈ సదస్సు శ్రీబడేసాబ్ గారి అధ్యక్షులుగా ప్రసంగిస్తూ “విదేశీ ఉద్యోగాలమోజులో పడి, ఆంగ్లవిద్యకోసం ఎగబడుతున్నారు. పదివేలమంది ఇంజనీర్లలో కనీసం 500 మందికి కూడా అక్కడ ఉద్యోగాలు రావడం లేదని మనదగ్గర పత్రికలలో రాసేందుకు విలేఖరులు కావాలని ప్రకటనలు ఇస్తున్నారని మీడియారంగం వంటివాటిల్లో అటువంటి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి”అని చెబుతూ, వక్తలు తాము చెప్పదలచుకొన్న విషయాన్ని ‘కుప్త సుందరం’గా ప్రసంగించాలని సూచిస్తూ, సభాసరస్వతికి…. ఇంకమొదలుపెట్టండి అని అనగానే సభాప్రాంగణం నవ్వులతో నిండిపోయింది. దాసరి శాంత కుమారిగారు సమావేశ కర్తగా, వక్తలు సాగర్ల సత్తయ్య, పురిమళ్ళ సునంద, ఉప్పల పద్మ, అద్దంకి తిరుమల వాణిశ్రీ, బైతి దుర్గయ్య, ఆర్. బసవయ్య, గీతావాణితదితరులు వక్తలుగా ప్రసంగించారు.
1. పాఠశాలలో విద్యార్థులలోని సృజననాత్మకతను వెలికి తీయడానికి బాలలపత్రికను వెలుగులోనికి తీసుకొని రావాలి.
2. తల్లిదండ్రులలో తెలుగుభాషపట్ల చైతన్యం తీసుకొని రావాలి.
3. విద్యార్థులకు కథలు, కవితలు రాయడంలో కార్యశాలలు నిర్వహించాలి. వారుకూడా ఆదశలో తమ సృజనాత్మక శక్తితో కథలు, కవితలు రాయడానికి ప్రోత్సహించాలి. వాటిని ఉపాధ్యాయులు మెరుగులు దిద్దితే, సమాజంలో ఉన్నతస్థాయిలో ఎదుగుతారు.
4. విద్యార్థులు తమతోటి స్నేహితులతో సన్నిహితంగా మెలగడం నేర్పాలి.
5. పిల్లలలో పఠనాశక్తిని పెంపొందించాలి! ముందు మన ఉపాధ్యాయులలో ఎంతమంది సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను చదువుతున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు.
6. పాఠశాల గ్రంథాలయాలలో పుస్తకాలు చదవడానికి విద్యార్ధులకు సమయం కేటాయించాలి. పుస్తకాలు చదివే విధంగా మనం వారిని ప్రోత్సహించాలి.
7. తప్పులు, తడకలు లేకుండా విద్యార్ధులు రాసేవిధంగా వారిని ప్రోత్సహించాలి.
8. సాహిత్యంతో పాటు సమకాలిన సమాజ స్థితి గతులు(కరెంట్ అఫైర్స్స్) పై, ప్రశ్నావళి ( క్విజ్) కార్యక్రమాలు పాఠశాలల్లో నిర్వహించాలి. దీనిమూలంగా వారిలో లోకజ్ఞానం పెంపొందుతుంది.
9. విద్యార్థుల సందేహాలను తీరుస్తూ, వారితో లేఖనం, వ్యాసాలు రాయిస్తూ ఉండాలి. వాటిని పుస్తక రూపంలో తీసుకొని రావాలి.
10. పిల్లలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రమే కాకుండా అందులో నిక్షిప్తమైన సాహిత్య సమాచారాన్ని ఏవిధంగా ఉపయోగించుకోవచ్చో తెలియజెయ్యాలి.
*ముఖ్యంగా తెలుగు అక్షరాలను ఏవిధంగా టైపు చెయ్యాలో నేర్పిస్తే వారికి ఆసక్తి పెరుగుతుంది.
నాలుగవ సదస్సు–“ప్రభుత్వపరంగా తీసుకోవలసిన చర్యలు!”
డా. జయప్రకాశ్ గారి అధ్యక్షతన, డా. శ్యాం ప్రసాద్ గారు సమన్వయ కర్తగా ఈ సదస్సుకు వ్యవహరించారు. చంద్రకాంత్ గౌడ్, డా. మంగళగిరి శ్రీనివాస్, శాంతిరెడ్డి, ఉండ్రాల రాజేశం , బోరుపట్ల స్వరూప్ తదితరులువక్తలుగా ప్రసంగించారు.
“తెలుగుభాషను ద్వితీయ సబ్జెక్ట్ గా బోధించడం లేని కొన్ని (చైతన్య, నారాయణ)వంటి ప్రవేటు పాఠశాలలకు ప్రభుత్వ అనుమతిని రద్దు చెయ్యాలని” చెబుతూ అధ్యక్షులువారు సభను ప్రారంభించారు.
1. పిల్లలు రాసిన సాహిత్యాన్ని ముద్రిస్తే వారిలో తెలుగుభాష పట్ల మక్కువ ఏర్పడుతుంది. ఉదా. తీరొకపూలు అనే బాలల పత్రికను తీసుకొని వచ్చారు.
2. ప్రస్తుతం ప్రాధమిక స్థాయిలో తెలుగు బోధన జరగడం లేదు. వ్యక్తి ప్రయోజనాలు కాకుండా వ్యష్టి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాతృభాష బోధన జరగాలి. ప్రాధమిక స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన చెయ్యాలి. వీలైతే 10. తరగతి వరకు దానిని కొనసాగించవచ్చు.
3. పదవ తరగతి వరకు ద్వితీయ భాషగా తెలుగును తప్పని సరి చెయ్యాలి.
4. ప్రాధమిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులను(పి.డి.సి, టి.డి.సి) నియమించాలి. అలాగే ప్రాధమిక స్థాయి (గ్రేట్ టు)లో బోధిస్తున్న ఉపాధ్యాయులను ఉన్నత స్థాయి( స్కూల్ అసిస్టంట్స్) పదోన్నతి కల్పించాలి.
5. అమెరికాలో వ్యవహారంలో ఉన్న విదేశీ భాషల్లో తెలుగు ఇరవైవ స్థానం, భారతీయ భాషల్లో రెండవ స్థానంలో ఉంది.
6. భాష ఇంటి వాతావరణంలోనే పరిపుష్టిని పొందుతుంది.
సమాపనోత్సవం
ఆచార్య ఎల్లూరి శివారెడ్డిగారు అధ్యక్షులుగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కె. వి. రమణాచారి గారు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి వాకాటి అరుణ గారు విశిష్ట అతిథులుగా, ప్రముఖ రచయిత్రి డా. ముదిగంటి సుజాతరెడ్డిగారు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. అమ్మిన శ్రీనివాస రాజుగారు సభ నిర్వహణను చేశారు.
కె. వి. రమణాచారి ప్రారంబోపన్యాసం చేస్తూ “ఈ సదస్సులో ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉంటే విద్యార్థులు లాగ తాము విన్నామని” చెప్పారు. పాలనభాషగా తెలుగు అమలు సన్నగిల్లుతోంది! మనమందరం ఒక తాటిపై ఉండాలని పిలుపునిచ్చారు. గురువులు పాఠశాల తరగతి గదులను భాషా పరిరక్షణ వేదికలుగా చేసుకోవాలని సూచించారు. ఉగాది తరువాత అధ్యాపకులతో కూడా ఇటువంటి సదస్సు నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు.
సదస్సుల సమీక్షను డా. సగిలి సుధారాణి చేశారు.
మీసాల సుధాకర్ రచించిన “మా అమ్మ దేవత” సరళ వచన శతకం, ఆణిముత్యాలు – ముత్యాల హారాలుపుస్తకాన్ని, డా. బి. సుధాకర్ రచించిన “చిచ్చర పిడుగులం”,పెరుమాళ్ళ ఆనంద్, పొట్టుబత్తుల రామకృష్ణ సంపాదకత్వం వహించిన నల్లగొండ జిల్లాకు చెందిన బడిపిల్లల కథా సంకలనం “బాలల కథల బండి”, యాడవరం చంద్రకాంత్ గౌడ్ రచించిన “చంద్రుడు చెప్పిన కథలు”(బాలల కథలు), పుస్తాకాలను అతిథులు ఆవిష్కరించారు.
“పాఠశాలలు, కళాశాలల విద్యార్ధులే కాక పి.హెచ్.డిలు చేసిన విద్యార్థులుసైతం తమ సిద్ధాంత గ్రంథాలలో అచ్చుతప్పులు రాస్తుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని కలిగిస్తుంది!” అని ప్రముఖ రచయిత్రి ముదిగొండ సుజాత రెడ్డిగారు ఆందోళన వెలిబుచ్చారు.
మనభాషను మనం కాపాడుకోకపోతే భవిష్యత్తు తరాలు మనల్ని మన్నించవని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. ఇలాంటి సదస్సులు జిల్లాలవారిగా మండల, గ్రామ స్థాయిల్లో కూడా నిర్వహించాలని సూచ్చించారు. సచివాలయాల్లో మొన్నటివరకు కనీసం 20 శాతందస్త్రాలు(ఫైల్లు) తెలుగులో వచ్చేవని ఇప్పుడు అదికూడా మృగ్యమవుతోందని ఆందోళను వ్యక్తం చేశారు. భాష పండితుల విషయంలో ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.
చివరిగా శ్రీ గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణగారు, శ్రీ గరిపల్లి అశోక్ గారు, డా. ఆర్. సూర్య ప్రకాశ్ రావుగారు సదస్సు తీర్మానాలు 18 ప్రతిపాదన చేశారు.
కార్యక్రమం చివర తెలంగాణ సారస్వత పరిషత్తు వారు అతిధులను సగౌరవంగా సత్కరించి డా.సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి గారు రచించిన కావ్యలక్షణాలు, డా. పి.యశోదా రెడ్డి గారు రచించిన పారిజాత అపహరణం, మాఊరి ముచ్చట్లు, కథా చరిత్ర, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ రచించిన శ్రీ శాలివాహన గాథ సప్తశతీ సారము, డా. మసన చెన్నప్ప గారి చెన్నప్ప పీఠికలు, ప్రాచీన కావ్యాలు గ్రామీణ జీవన చిత్రణ, సి.వి. రామచంద్రారావు గారు రాసిన మన కృష్ణా గోదావరులు, పద్యకుసుమావళి, గద్య కుసుమావళి ఆణిముత్యాల వంటి అమూల్యమైన అరుదైన పుస్తకాలను అందజేశారు.