బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు తెలంగాణ శాసనసభ స్పీకర్ కార్యాలయం నోటీసులు అంద జేసింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర మనిషితో పోలుస్తూ ఈటల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోనే ఈ నోటీసులు జారీ అయ్యాయి. బీఏసీ సమావేశానికి తమ పార్టీని పిలవలేదని, సీఎం కేసీఆర్ చెప్పినట్లే స్పీకర్ నడుచుకుంటున్నారని, ఆయనో మర మనిషి అంటూ ఈటల రాజేందర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సభా సంప్రదాయాలను మొత్తం మరిచి పోతున్నారని, ఈటల మండిపడ్డారు.
ముఖ్యమంత్రులు వచ్చి పోతుంటారని, అసెంబ్లీ మాత్రం శాశ్వతంగా వుంటుందని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో కూడా 20 రోజుల పాటు సభా కార్యకలాపాలు నడిచేవని, ప్రత్యేక రాష్ట్ర వచ్చిన తర్వాత మాత్రం ఐదు నిమిషాలు, మూడు రోజుల పాటే సభలు జరగడం ఏంటని ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు. అయితే తనకు ఎలాంటి నోటీసులూ అందలేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రకటించారు. నోటీసులు ఇస్తే ఇవ్వొచ్చేమో అన్న ఆయన.. తనను శాసనసభలో ఉండకుండా చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడని ఆరోపించారు.