మెడికో విద్యార్థి డాక్టర్ ప్రీతి మృతి నేపథ్యంలో రాజ్ భవన్ కాళోజీ విశ్వ విద్యాలయానికి లేఖ రాసింది. మెడికో ప్రీతి మరణంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయాలని గవర్నర్ తమిళిసై ఆదేశించారు. మెడికో ప్రీతి మరణం భయంకరమైందిగా ఆ లేఖలో రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయమై వాస్తవాలు తెలుసుకోవడానికి అన్ని కోణాల నుండి విచారణ అవసరమని రాజ్ భవన్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

 

కాళోజీ యూనివర్శిటీలో ర్యాగింగ్, వేధింపుల తరహ ఘటనలపై గవర్నర్ తమిళిసై నివేదిక కోరారు. మెడికోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పనివేళలు , మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పనితీరు అంశాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించాయి రాజ్ భవన్ వర్గాలు. సమగ్ర విచారణ జరిపి, నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. మెడికల్ కాలేజీల్లో యాంటి ర్యాగింగ్ చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని, మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. మెడికల్ కాలేజీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పీజీ మెడికోల డ్యూటీ సమయాలు, విశ్రాంతి లాంటి వాటిపై శ్రద్ధ పెట్టాలన్నారు.

 

మెడికో ప్రీతి మరణంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం, పార్టీ పరంగా ప్రీతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ వల్ల డాక్టర్ ప్రీతి మరణించడం బాధాకరమన్నారు. హనుమకొండలో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ పై వ్యాఖ్యలు చేవారు. అయితే..ఈ విషయాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని, నిందితులు ఎవరైనా.. సైఫ్ అయినా.. సంజయ్ అయినా.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు.