తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17 న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. ప్రారంభోత్సవానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సుదర్శన యాగం వేద పండితులతో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఝార్కండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, బీహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌, బీఆర్‌ అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌, ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. అయితే.. ఈ సచివాలయం ప్రారంభం తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు.

కొన్ని రోజుల క్రిందటే ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ అత్యద్భుతంగా జరిగింది. మళ్లీ సికింద్రాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ మరో భారీ బహిరంగ సభకు పూనుకోవడం విశేషం. నూతన తెలంగాణ సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరును ఖరారు చేస్తూ ఇప్పటికే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు మార్లు సీఎం కేసీఆర్ సచివాలయాన్ని సందర్శించారు. పనులు వేగిరంగా పూర్తి కావాలని కూడా సూచించారు. వాస్తవానికి గతేడాదే సచివాలయ నిర్మాణం పూర్తి కావాల్సి వుంది. కానీ… కరోనా కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది.

ఇక… నూతన సచివాలయం ఆవరణలో పు నర్నిరించిన నల్లపోచమ్మ ఆలయంలో ప్రతిష్ఠించనున్న దేవతామూర్తుల రాతి విగ్రహాలు సిద్ధమయ్యాయి. వీటిని టీటీడీకి చెందిన ప్రత్యేక వాహనంలో తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. నల్లపోచమ్మ ఆలయంలో వినాయకుడు, సు బ్రహ్మణ్యస్వామి, అభయాంజనేయస్వామి, సింహవాహనం, నందివాహనం, పానవట్టం తో కూడిన శివలింగం ప్రతిష్ఠించనున్నారు.విగ్రహాలను టీటీడీకి చెందిన శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రెడిషనల్‌ స్కల్ప్‌చర్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ (ఎస్‌వీఐటీఎస్‌ఏ) ఆధ్వర్యంలో త యారు చేయించారు.