తెలంగాణలో నేటి నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం అవుతాయి. విద్యార్థులందరూ ఉదయం 8:45 నిమిషాల లోపు పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాల్సి వుంటుంది. ఉదయం 9 తర్వాత మాత్రం అనుమతించమని అధికారులు ప్రకటించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు ఏప్రిల్ 4 వ తేదీ వరకూ కొనసాగుతాయి. మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల కోసం 75 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 26,333 మంది ఇన్విజిలేటర్లు, 1,473 మంది చీఫ్ సూపరింటెండెట్లను నియమించింది ప్రభుత్వం.

 

ఏ ఇబ్బంది వచ్చినా 040–24601010, 040–24655027 ప్రత్యేక టోల్‌‌‌‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌‌‌‌ చేయాలని స్టూడెంట్లకు సూచించారు. ఇవి ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయన్నారు. కాలేజీలతో ప్రమేయం లేకుండా స్టూడెంట్లే బోర్డ్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ నుంచి హాల్‌‌‌‌ టికెట్లు డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. ఈ ఏడాది ఆన్సర్ షీట్ల ఆన్​లైన్​ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచామని, రెండోసారి 2 కంపెనీలు ముందుకొచ్చాయని చెప్పారు. అయితే… ఏ సంస్థకి టెండర్లు ఇస్తామన్నది ఇంకా నిర్ణయం కాలేదని అధికారులు పేర్కొన్నారు.