ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఒక్కసారి కాదు… 100 సార్లు మొక్కుతా అని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకుడు గడల శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ పాదాలను తాకడమే ఓ అదృష్టంగా భావిస్తానని తేల్చి చెప్పారు. ఆయన తనకు తండ్రి సమానులని, కావాలనే కొందరు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కొన్ని రోజుల క్రితం తెలంగాణలో 8 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచే వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సమావేశం పూర్తైన తర్వాత ఆరోగ్యశాఖ సంచాలకులు గడల శ్రీనివాస రావు సీఎం కేసీఆర్ పాదాలకు నమస్కరించారు. దీంతో అప్పుడే తీవ్ర విమర్శలు చెలరేగాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఓ ప్రభుత్వ అధికారి అయి వుండి… సీఎం పాదాలు నమస్కరించడం ఏంటని ప్రశ్నించారు.

 

తాజాగా…. కొత్తగూడెంలో నిర్వహించిన వన మహోత్సవంలో భాగంగా డీహెచ్ శ్రీనివాస రావు దీనిపై స్పందించారు. ”సీఎం కేసీఆర్ కి ఒక్క సారి కాదు.. 100 సార్లు మొక్కుతా. ఆయన నాకు తండ్రి సమానులు. బంగారు తెలంగాణ దిశగా సాగుతున్న పాలనా దక్షుడు. ఆయన పాదాలను తాకడమే అదృష్టంగా భావిస్తా” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.