విద్యా సంస్థల్లోనూ చిన్నారులు, యువతులపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే వున్నాయి. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. చిన్నారులు, యువతుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఓ చట్టం తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయ్యింది. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఉస్మానియా యూనివర్శిటీలో జరిగిన ఓ కార్యక్రమం వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యా సంస్థల్లో అమ్మాయిల మీద జరిగే అఘాయిత్యాలను నివారించేందుకు త్వరలోనే ప్రభుత్వం ఓ కొత్త చట్టం తేనుందని, మేనేజ్ మెంట్ నే బాధ్యత చేస్తూ ఈ చట్టం రానుందని ప్రకటించారు.

 

యాంటీ డ్రగ్స్ కమిటీల మాదిరే ఈ చట్టం కూడా పనిచేస్తుందని ప్రకటించారు. డీఏవీ స్కూలులో జరిగిన ఘటన తర్వాతే ఈ చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఇక… రాష్ట్రంలోకి డ్రగ్స్ రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తల్లిదండ్రులందరూ తమ తమ పిల్లలపై ఓ కన్నేసి వుంచాలని సూచించారు. ఇప్పటి వరకూ 34 కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేశామని ప్రకటించారు.ఒక్కో కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీలో 5గురు సభ్యులుండాలని సూచించారు.