తాము పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం మెట్లెక్కడంపై గవర్నర్ ట్విట్టర్ వేదికగా పరోక్షంగా స్పందించారు. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరగా వుందంటూ సీఎస్ శాంతి కుమారికి సూచించారు. సీఎస్ గా శాంతి కుమారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత… కనీసం మర్యాద పూర్వకంగా కూడా వచ్చి కలవలేదని, కనీసం ఫోన్ కూడా చేయలేదంటూ గవర్నర్ తమిళిసై ట్వీట్ చేశారు. మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నా.. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరగా ఉంది అంటూ ట్విట్టర్ ద్వారా గవర్నర్ పరోక్షంగా విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ కి మళ్లీ పంచాయతీ ముదిరింది. కొన్ని రోజుల పాటు సజావుగానే సాగినా… మళ్లీ వివాదం రేగింది. 10 బిల్లులను గవర్నర్ తమిళిసై ఆపేశారంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లెక్కింది. ఇదే విషయంపై సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. గవర్నర్ వద్ద పెండింగ్ లో వున్న బిల్లులను ఆమోదించేలా ఆదేశించాలంటూ చీఫ్ సెక్రెటరీ పిటిషన్ లో కోరారు. సెప్టెంబర్ నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులు రాజ్ భవన్ లో పెండింగ్ లో వున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసులో ప్రతి వాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖను చేర్చింది సర్కార్.

పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవే..

1. పంచాయ‌తీరాజ్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు
2. మున్సిప‌ల్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు
3. మోటార్ వెహిక‌ల్ టాక్సేష‌న్ స‌వ‌ర‌ణ బిల్లు
4. వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌య స‌వ‌ర‌ణ బిల్లు
5. తెలంగాణ విశ్వ‌విద్యాల‌యాల ఉమ్మ‌డి నియామ‌క బోర్డు బిల్లు
6. ములుగులో అట‌వీ కళాశాల‌, ప‌రిశోధ‌నా సంస్థ‌ను అట‌వీ వ‌ర్సిటీ అప్‌గ్రేడ్ బిల్లు
7. అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు
8. ప‌బ్లిక్ ఎంప్లాయిమెంట్ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు
9. జీఎస్టీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు
10. ప్ర‌యివేటు విశ్వ‌విద్యాల‌యాల చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు