తెలంగాణ కాంగ్రెస్ వార్ రూమ్ పై సైబర్ పోలీసులు దాడులు చేశారు. ఆఫీసులోని పత్రాలను పరిశీలించారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. తెలంగాణ ప్రభుత్వం వందలాది మంది పోలీసులతో తమ వార్ రూమ్ పై దాడి చేశారని, ఫర్నీచర్ ను ధ్వంసం చేశారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అలాగే మఫ్టీలో వుండి పోలీసులు తమ నేతలపై, సిబ్బందిపై దాడులు చేశారని ఆరోపించారు. తమ డేటా మొత్తాన్ని పోలీసులు చోరీ చేశారని, గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ కాంగ్రెస్ కార్యకర్తల డేటా అందులో వుందని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ దాడుల సమయంలో పోలీసు అధికారులకు తాను ఫోన్ చేశానని, అయినా… లిఫ్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ: కాంగ్రెస్ వార్ రూంలో డేటాను ధ్వంసం చేశారు.. మా నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు.. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం రోజు కాంగ్రెస్‌పై ఇలా చేస్తారా.. మీరు పోలీసులా.. దొంగలా?
-టీపీసీసీ అధ్యక్షుడు, రేవంత్‌రెడ్డి.@revanth_anumula pic.twitter.com/NTI9GzO6sf
— Telangana Congress (@INCTelangana) December 14, 2022
ఓ ఎంపీ ఫోన్ ను కూడా ఎత్తడం లేదన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని, దీనిని తట్టుకోలేకే దాడులు చేయిస్తోందని రేవంత్ అన్నారు. పాదయాత్రలో రాహుల్ పలు అంశాలను లేవనెత్తుతున్నారని, ఆ అంశాలు బీజేపీకి, సీఎం కేసీఆర్ కి నచ్చడం లేదని, అందుకే ఇలా దాడులు చేస్తున్నారని అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలుస్తున్నాయనే కోపంతో దాడులు చేయించారని మండిపడ్డారు. కుట్రలు,కుతంత్రాల్లో భాగంగానే వార్ రూమ్ పై రైడ్ జరిగిందన్నారు.