కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సైబర్ క్రైం పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలును ప్రశ్నించిన అధికారులు.. తాజాగా పార్టీ సీనియర్ నేత మల్లు రవికి నోటీసులు జారీ చేశారు. వార్ రూం కేసులో విచారణకు రావాలంటూ మల్లు రవికి సీఆర్పీసీ 41A కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. మరోవైపు వార్ రూం కేసులో కాస్త ఆలస్యంగా సీసీఎస్ కు వచ్చిన కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలును సైబర్ క్రైం అధికారులు గంట పాటు విచారించారు. విచారణ తర్వాత ఆయన సైబర్ క్రైం కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అంతకుముందు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంతో పాటు నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ సైబర్ క్రైం పోలీసులు.. కాంగ్రెస్ వార్ రూంలో సోదాలు నిర్వహించారు. ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.