కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మళ్లీ టార్గెట్ అయ్యారు. అయితే.. ఈ సారి మూకుమ్మడిగా సీనియర్లందరూ కూడబలుక్కొని టార్గెట్ చేశారు. కొత్తగా వేసిన పీసీసీ కమిటీలు పార్టీలో తీవ్ర అసంతృప్తినే రాజేశాయి. ఇప్పటికే పలువురు రాజీనామా చేసేశారు. తాజాగా… సీరియర్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇంట్లో సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. సేవ్ కాంగ్రెస్ తో తాము ముందుకు వెళ్తామని ప్రకటించేశారు. కొత్తగా వచ్చినోళ్లకు కొత్త కమిటీల్లో 50శాతానికి పైగా పదవులు కల్పించారని మండిపడ్డారు. పైగా ఒర్జినల్ కాంగ్రెస్ లీడర్లను సోషల్ మీడియాలో బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కమిటీల్లో వున్న సగానికి పైగా మంది టీడీపీ నుంచి వచ్చిన వారేనని, అసలు ఒరిజినల్ కాంగ్రెస్ తమదేనని ప్రకటించారు. కొత్త పీసీసీ కమిటీలపై ఢిల్లీలోనే తేల్చుకుంటామని ప్రకటించారు. కమిటీల్లో అన్యాయం జరిగిందని తనతో చాలా మంది చెప్పారని, అసంతృప్తిని అధిష్ఠానానికి తెలియజేస్తామని మల్లు తెలిపారు. కాంగ్రెస్ ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందని, సేవ్ కాంగ్రెస్ తో ముందుకు కదలాలని డిసైడ్ అయ్యారన్నారు. కొందరు కావాలనే పార్టీకి నష్టం వాటిల్లేలా చేస్తున్నారన్నారు.
ఇక…. మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై తాము చర్చించామని వెల్లడించారు. కాంగ్రెస్ ఓ ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పుకొచ్చారు. కొంత మందిని అవమానించడానికే కొత్త కమిటీలు వేసినట్లుందని మండిపడ్డారు. ఒరిజినల్ కాంగ్రెస్ ను కాపాడుకోవడమే తమ లక్ష్యమని, కావాలని సోషల్ మీడియాలో తమపై బురద జల్లుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు.