తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో జరిగే కీలక భేటీ హాజరయ్యారు. మొదటగా వీరందరూ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఆ తర్వాత అమిత్ షా, తెలంగాణ బీజేపీ నేతలు కలిసి, జేపీ నడ్డా నివాసానికి చేరుకున్నారు. అక్కడ కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, సుధాకర్ రెడ్డి, లక్ష్మణ్, విజయశాంతి, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, తదుపరి లక్ష్యాలపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు జేపీ నడ్డా, అమిత్ షా ఓ రూట్ మ్యాప్ ని కూడా ఇవ్వనున్నారు. ఓ మినీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశమే జరుగుతోంది. మిషన్ 90, తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల ప్రణాళిక పై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రణాళికలను రచించింది. మిషన్‌ 90 పేరుతో 10 నెలలకు కావాల్సిన రోడ్‌మ్యాప్‌, నియోజకవర్గాల వారీగా సమావేశాల గురించి పలు సూచనలు చేసింది. ఇప్పటికే స్ట్రీట్ కార్నర్ మీటింగులు కూడా బీజేపీ నిర్వహిస్తోంది.

మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో వున్నారని బాగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అమలు చేయాల్సిన ప్రణాళికలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఒకవేళ హఠాత్తుగా కేసీఆర్ ముందస్తు అని ప్రకటిస్తే.. అప్పటికప్పుడు అనుసరించాల్సిన వ్యూహం కూడా ఇదే సమావేశంలో ఖరారు కానుంది. ఇక… తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఈ విషయం కూడా ఈ భేటీలో ప్రస్తావనకు రానుంది. అయితే… ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయితే…. అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.