మునుగోడు బై పోల్ ను బీజేపీతో సహా అన్ని పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగానే తీసుకున్నాయి. బీజేపీ ఇప్పటికే పలు సార్లు మునుగోడును పరిశీలించి, ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్ ఛార్జీ సునీల్ బన్సల్ మునుగోడుపై ఇప్పటికే 2 సార్లు సమీక్షలు నిర్వహించి, రాష్ట్ర నేతలకు ప్రత్యేకంగా మార్గనిర్దేశనం చేశారు. అయితే.. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని, మునుగోడు బైపోల్ తెచ్చారని అధికార టీఆర్ఎస్ నేరుగా మాటల దాడికి దిగింది. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత పెరిగిపోయింది.

 

 

ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారు. పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. మునుగోడు బైపోల్ పై ఓ రిపోర్టును కూడా పార్టీ పెద్దలకు సమర్పిస్తారని తెలుస్తోంది. మునుగోడులో ప్రస్తుత పరిస్థితి, ప్రచార సరళి వివిధ అంశాలపై బండి సంజయ్ ఓ రిపోర్టును సమర్పిస్తారు. అధిష్ఠానం కూడా బండి సంజయ్ కి పలు సూచనలు చేస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు ఢిల్లీ మీటింగ్ అవ్వగానే.. వారణాసి వెళ్తారు. వారణాసిలో కాశీ విశ్వనాథుడ్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి బండి సంజయ్ కర్నాటకలో వున్న దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాన్ని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేయనున్నారు.