ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం మెడకు చుట్టుకుంది. మొన్నటికి మొన్నే రబ్రీదేవి ఇంట్లో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత మాజీ సీఎం లాలూ ప్రసాద్ ను కూడా విచారించింది. తాజాగా బిహార్ డిప్యూటీ సీఎం, లాలూ ప్రసాద్ కుమారుడు తేజస్వీ యాదవ్ ఢిల్లీ నివాసంలో ఈడీ సోదాలు చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్(Land For Jobs Scam)లో ఆ తనిఖీలు జరిగాయి.
లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ మనీల్యాండరింగ్కు పాల్పడిందని, ఈ కేసుతో లింకున్న 15 ప్రదేశాల్లో ఇవాళ ఈడీ సోదాలు నిర్వహిస్తున్నది. ఇక… లాలూకు అత్యంత సన్నిహితుడు, పార్టీ ఎమ్మెల్యే అబు దొజానా ఇంట్లో కూడా సోదాలు జరిగాయి. లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా వున్న సమయంలో 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరిగింది. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
మాజీ రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav)ను సీబీఐ విచారించింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్(Land for jobs scam)లో భాగంగా ఈ విచారణ కొనసాగింది. పాట్నాలోని లాలూ కూతురు మీసా భారతి ఇంట్లో ఈ దర్యాప్తు జరిగింది. ఈ కేసుతో లింకు ఉన్న లాలూ భార్య.. బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిని సోమవారం సీబీఐ(CBI) ప్రశ్నించిన విషయం తెలిసిందే.
తన తండ్రిని వేధిస్తున్నారని లాలూ కూతురు రోహిని ఆచార్య(Rohini Acharya) ఆరోపించారు. తన తండ్రికి ఏం జరిగినా.. ఎట్టి పరిస్థితుల్లో ఎవర్ని సహించేది లేదని ఆమె వార్నింగ్ ఇచ్చారు. కాలం చాలా శక్తివంతమైందని, ఇది గుర్తుపెట్టుకోవాలని ఆమె ఓ ట్వీట్లో హెచ్చరించారు.












