రాజమండ్రి జైలు నుంచి విడుదలైన టీడీపీ నేత పట్టాభి

గన్నవరం ఘటనలో అరెస్టైన టీడీపీ సీనియర్ నేత కొమ్మారెడ్డి పట్టాభికి కోర్టులో ఊరట లభించింది. జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి విడుదలయ్యారు. రూ.25వేల చోప్పున పూచీకత్తు ఇవ్వాలనీ కోర్టు ఆదేశించింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పట్టాభికి తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఫిర్యాదు చేసేందుకు వెళితే…. అక్రమంగా కేసులో ఇరికించారని మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి హింసించినా…. బెదిరేది మాత్రం లేదన్నారు. ఇప్పటికే 4 సార్లు తనపై దాడి జరిగిందని, అయినా… ప్రభుత్వంపై పోరాడుతూనే వుంటానని ప్రకటించారు.

 

ఇక.. మూడు నెలల పాటు ప్రతి గురువారం పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. పట్టాభి తదితరులను కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఆయనతో అరెస్టయి 11 మంది టీడీపీ నేతలకు కూడా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ కోర్టు.గన్నవరం కోర్టులో షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది.

 

ఇటీవల గన్నవరంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. టీడీపీ ఆఫీస్ ఆవరణలో ఉన్న కారుకి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో, తనను కులం పేరుతో దూషించారంటూ సీఐ కనకరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేత పట్టాభి తదితరులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది.

Related Posts

Latest News Updates