ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయో ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వర రావు డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎంగా వున్న సమయంలో దావోస్ కి 9 సార్లు వెళ్లారని, ఏపీకి పెట్టుబడులు తెచ్చి పెట్టారన్నారు. కానీ… దావోస్ వేదికగా ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక సదస్సులు జరుగుతున్నాయని, అందుకే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అక్కడికి వెళ్లారన్నారు. కానీ… సీఎం జగన్ మాత్రం ఒక్కసారి మాత్రమే దావోస్ వెళ్లారని, ఇప్పుడు ఎందుకు వెళ్లడం లేదని సూటిగా ప్రశ్నించారు.
దావోస్ లో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరై… పరిశ్రమలను తెలంగాణకు తీసుకెళ్తున్నారని, సీఎం జగన్ మాత్రం అలా చేయడం లేదని విమర్శించారు. వైఎస్ జగన్, వైసీపీ ప్రభుత్వ అవినీతికి ఏపీకి పరిశ్రమలు రావాలంటేనే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. దావోస్ లో ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు ప్రాతినిధ్యం లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ యువత బీర్లు అమ్ముకుంటూ, గంజాయి పీలుస్తూ బతకాలన్నదే సీఎం జగన్ ఆలోచనా? అంటూ బోండా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.















