దొంగల్లా వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు ఫైర్

టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి అరెస్ట్ పై ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఏపీలో అరాచకపాలన సాగుతోందని, దీనికి పరాకాష్ట మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి అరెస్ట్ అని పేర్కొన్నారు. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే తప్పుడు కేసులు పెడుతున్నారని, ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అరెస్ట్‌లు పరాకాష్టకు చేరుకున్నాయని ఫైర్ అయ్యారు. అర్ధరాత్రి దొంగల్లా వచ్చి అరెస్ట్ చేశారని, మద్యం మత్తులో వచ్చి దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. తాగిన మైకంలో వచ్చి దుర్మార్గంగా అరెస్ట్ చేశారని కుటుంబీకులు తెలిపారని గుర్తు చేశారు. కనీసం చెప్పులు కూడా వేసుకోనీయకుండా తీసుకెళ్తారా? అర్ధరాత్రి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. వివేకా హత్యపై షర్మిల వాంగ్మూలం, రుషికొండ అంశం నుంచి ప్రజల ను మరల్చడానికే అయ్యన్నను అరెస్ట్ చేశారని ఆరోపించారు.

 

వైసీపీ నేతల్లా అయ్యన్నపాత్రుడు అవినీతికి పాల్పడలేదని, భూకబ్జాలు చేయలేదని, వైసీపీ నేతలు విశాఖలో వేలాది ఎకరాలను కబ్జా చేశారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారి గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయ్యన్న హత్య చేశారా? హత్యా రాజకీయాలు చేశారా? అని నిలదీశారు. పేదలకు భూములిచ్చిన చరిత్ర అయ్యన్నదని గుర్తు చేశారు. అయ్యన్న తాత నుంచి ఆ కుటుంబానికి మచ్చలేని రాజకీయ చరిత్ర వుందని, భూ దోపిడీ కుటుంబం నుంచి వచ్చిన చరిత్ర జగన్ ది అని చంద్రబాబు విమర్శించారు.

 

సీఐడీ టార్చర్ ఆఫీస్ గా మారిపోయింది….

సీఐడీ కార్యాలయం ఓ టార్చర్ ఆఫీసుగా మారిపోయిందని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. శారీరంకగా తమను హింసించినా… తాము మానసికంగా బలంగానే వుంటామని స్పష్టం చేశారు. నలుగురు మాజీ మంత్రులను అక్రమంగా అరెస్ట్ చేయించారని, అయ్యన్నపై రేప్ కేసు పెడతారా? అని అన్నారు. తప్పుడు పనులు చేస్తున్న అధికారులపై కచ్చితంగా చర్యలుంటాయని, ఇదంతా రికార్డుల్లో వుంటుంది.. గుర్తుంచుకోవాలని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.

 

 

Related Posts

Latest News Updates