తిరిగి ఎన్డీయేలో చేరే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విషయాన్ని ప్రచారం చేస్తున్న వారే దానికి సమాధానం చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ టీడీపీ కలిసి బరిలోకి దిగుతాయని రిపబ్లిక్ టీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పై విధంగా స్పందించారు. ఈ విషయంపై తానే ఇప్పుడేం స్పందించనని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు ఎన్డీఏ నుంచి బయటకువచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు. ఇక… ఇదే విషయంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించారు. ఏపీలో మాత్రం జనసేనతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. అయితే.. ఎన్డీయేలోకి టీడీపీ వస్తుందన్న ప్రచారం కేవలం ప్రచారమేనన్నారు. ఒకవేళ ఎన్డీయేలోకి వస్తే.. తాము మీడియాకు సమాచారం ఇస్తామని లక్ష్మణ్ అన్నారు.