ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై సీఈసీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్నికల్లో పలు అక్రమాలను, ఉల్లంఘనలకు వివరించి తక్షణ చర్యలు కోరుతూ లేఖ రాశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వైసీపీ తీవ్రంగా ఉల్లంఘించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వైసీపీ తీవ్రంగా ఉల్లంఘిస్తోందన్నారు. రాష్ట్ర మంత్రి ఉషశ్రీచరణ్ డబ్బుల పంపిణీ విషయానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోందని ఉదహరించారు. ఓటుకు 1000 రూపాయలు పంచాలని స్వయంగా మంత్రి క్యాడర్ కి, అధికారులకు సూచనలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే ఎన్నికల నిబంధనలను కాదని, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కడప నుంచి తంబళ్లపల్లి వరకూ ర్యాలీ నిర్వహించారని, 48 గంటల ముందే ప్రచారం నిలిపేయాల్సి వున్నా…. ఆ నిబంధనను ఉల్లంఘించారని మండిపడ్డారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలోని వార్డు నెం. 16, బూత్ నంబర్ 232లో వైసీపీ అనుచరుడు ఈశ్వరరావు డబ్బు పంపిణీ చేస్తూ పట్టుబడ్డారన్నారని, తిరుపతి పట్టణంలో 9వ తరగతి విద్యార్హత కలిగిన విజయ అనే మహిళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అక్రమ ఓటు వేశారన్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
వీటితో పాటు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో YSRCP అనుచరులు రమణ మహర్షి స్కూల్ వద్ద డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కడం, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడు అభినయ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ పోలింగ్ బూత్‌లలోకి అక్రమంగా ప్రవేశించడం లాంటి వాటిని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈ ఘటనలకు సంబంధించి ఆధారాలు పంపుతున్నట్లు చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు.













