ఎవ్వరూ భయపడొద్దు…. కార్యకర్తలకు అండగా వుంటాం : చంద్రబాబు నాయుడు

తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడూ అండగానే వుంటుందని, ఎవ్వరూ భయపడవద్దని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో పోలీసుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తలను చంద్రబాబు నాయుడు పరామర్శించారు. పోలీసుల దాడిలో గాయపడిన కార్యకర్తలకు పార్టీ అండగా వుంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. టీడీపీ కార్యకర్తలపై జగన్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని, అక్రమ కేసులకు వ్యతిరేకంగా న్యాయబద్ధంగా పోరాడుతామని ప్రకటించారు. జగ్గంపేట, పెద్దాపురంలో లేని ఆంక్షలు అనపర్తిలోనే వచ్చాయా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల్లో వ్యతిరేకత గమనించే వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని, టీడీపీపైకి పోలీసులను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. ఇదంతా ప్రభుత్వ సలహాదారు సజ్జల కనుసన్నల్లోనే నడుస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

 

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోగా..కాన్వాయ్‌కు అడ్డుగా బైఠాయించారు. దీంతో దాదాపు 7 కిలోమీటర్ల మేర కాలినడకతో అనపర్తి చేరుకున్నారు. టీడీపీ చేపట్టిన ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా అనపర్తి పర్యటన చేపట్టారు. రాష్ట్రంలో జీవో నెంబర్ 1 అమల్లో ఉండటంతో..పోలీసులు ఆయన పర్యటనను అడ్డుకున్నారు. ఫలితంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 7 కిలోమీటర్ల మేర నడిచి..అక్కడున్న బొలేరో వాహనం టాప్‌పై నిచ్చెన సహాయంతో ఎక్కి ప్రసంగం పూర్తి చేశారు.

 

సభకు పోలీసులు అనుమతివ్వకపోవడంతో చంద్రబాబు అనపర్తి దేవీచౌక్‌లోనే సభ నిర్వహిస్తానని పట్టుబట్టారు. పోలీసులు ఎలా అడ్డుపడతారో చూస్తానంటూ భీష్మించారు. అటు పోలీసుల అడ్డంకులు, ఇటు టీడీపీ చంద్రబాబు నాయుడు పట్టుదల మధ్య  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అడ్డుకుంటున్నా కాన్వాయ్ ముందుకు కదిలించేందుకే ప్రయత్నించారు. పోలీసులు ముందుకు కదలనివ్వకపోవడంతో..కాలినడకన అనపర్తి చేరుకుని..నిచ్చెన సహాయంతో బొలేరో వాహనం ఎక్కి మరీ ప్రసంగించారు.

Related Posts

Latest News Updates