మాజీ మంత్రి వైఎస్ వివేకా నాలుగో వర్ధంతిని పురస్కరించుకొని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. జస్టిస్ ఫర్ వివేకా అంటూ ట్వీట్ చేశారు. వివేకా హత్య జగనాసుర రక్త చరిత్రే అని పులివెందుల పూల అంగళ్ల సెంటర్ నుంచి రాష్ట్రం లో ప్రతి ఇంటా తెలుసు…అది ఆ ఇంట జరిగిన కుట్రే అంటూ చంద్రబాబు ఆరోపించారు. తండ్రి శవం పక్కన ఉండగానే పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి… బాబాయ్ హత్య తో రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి….ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా? అంటూ ప్రశ్నించారు. వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క పనీ చేయలేక పోయారు…చివరకు సొంత బాబాయ్ హత్య కేసులో నిజమైన నిందితులను శిక్షించడంతో సహా ఏపనీ చేయలేదని చంద్రబాబు ట్విట్టర్ లో పేర్కొన్నారు.
వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ఒక్క పనీ చేయలేక పోయారు…చివరకు సొంత బాబాయ్ హత్య కేసులో నిజమైన నిందితులను శిక్షించడంతో సహా….!(1/3)#JusticeForYSViveka
— N Chandrababu Naidu (@ncbn) March 15, 2023
తన తండ్రిని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాలని, తనకు తెలిసిన విషయాలన్నీ సీబీఐకి చెప్పానని వివేకారెడ్డి కుమార్తె డా. సునీతారెడ్డి పేర్కొన్నారు. తన తండ్రి హత్య విషయంలో కుటుంబీకుల పైనే నిందలు వేస్తున్నారని, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి నాలుగో వర్ధంతి సందర్భంగా తన తండ్రి సమాధి వద్ద కుమార్తె వైఎస్ సునీతారెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పోలీసుల మీద ఒత్తిడి పెట్టకుండా వాళ్ల పని వాళ్లని చేయనీయాలని సునీత కోరారు.
వైఎస్ వివేకా హత్య కేసులో ఎవరైనా సరే.. ఎంతటి వారైనా సరే బయటకు రావాలని సునీత పేర్కొన్నారు. పిల్లలు తప్పు చేస్తే ఖండిస్తామని.. అలాగే పెద్దలు తప్పు చేసినా వదిలిపెట్టకూడదని డిమాండ్ చేశారు. కడపలో అరాచకాలు తగ్గాయని అందరూ అంటున్నారని, కానీ పెరిగాయని ఆరోపించారు. అందుకు తన తండ్రి హత్యే ఇందుకు ఉదాహరణ అని వివరించారు. తప్పు చేసిన వాళ్లకి శిక్షపడితేనే నేరాలు తగ్గుతాయని వైఎస్ సునీత పేర్కొన్నారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోందని, కాబట్టి తానేమీ మాట్లాడలేనని ఆమె పేర్కొన్నారు.













