ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో భారత్ కు తిరుగులేదని, వచ్చే 25 సంవత్సరాల కోసం ఇప్పటి నుంచే ఓ ప్రత్యేక విజన్ తో పనిచేయాలని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఇలా చేస్తే 2047 నాటికి ప్రపంచ దేశాల్లో భారత దేశమే అగ్రస్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలా భాగస్వాములం అవుతామన్నది మేనేజ్ మెంట్ విద్యార్థులు స్వతహాగా ఆలోచించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బినిజెస్ (ఐఎస్బీ) ప్రాంగణంలో జరిగిన 20వ వార్షికోత్సవం ముగింపు వేడుకల్లో చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఐఎస్ బీ వ్యవస్థాపక డీన్ ప్రమత్ రాజ్ సిన్హాతో చర్చా గోష్టిలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఎన్నో విజయాలను నమోదు చేస్తున్నారని, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు సీఈవోగా మన తెలుగు వ్యక్తి ఉన్నారని, ఇది గర్వకారణమని వివరించారు. అభివ్రుద్ధి ఫలాలు అందరికీ అందాలని, ఇందుకు కార్పొరేట్ దిగ్గజాలు, మేనేజ్ మెంట్ స్కూళ్ల విద్యార్థులు ప్రభుత్వ విధానాల్లో భాగస్వాములు కావాలన్నారు.

ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐఎస్ బీ, మైక్రోసాఫ్ట్ ఏర్పాటు సహా పలు అంశాలపై మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్ విద్య అందించేందుకు ఐఎస్ బీనిముంబై, బెంగళూరు, చెన్నైలో నెలకొల్పాలని భావించారని, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు కంటే ఎక్కువ రాయితీలు అందించి హైదరాబాద్ వచ్చేలా చూశామని వివరించారు. ఐఎస్ బీ గవర్నింగ్ బోర్డు పరిశీలనలో హైదరాబాద్ లేదు. రజత్ గుప్తాకు నేను ఫోన్ చేసి పిలిస్తే, బోర్డు సభ్యులు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ నే ఎంచుకోవాల్సిన పనిలేదని, ఒక్కసారి వచ్చి వెళ్లండని కోరాను. ఇక్కడికి వారు వచ్చిన తర్వాత వారిని ఒప్పిస్తానన్న నమ్మకం నాకుంది. చివరికి ఒప్పించాం అంటూ ఆనాటి సంగతులను చంద్రబాబు వెల్లడించారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోనూ ఓ రాజధాని కావాలన్నదే తన అభిమతమని, అందుకే అమరావతికి రూపకల్పన జరిగిందని చంద్రబాబు నాయుడు వివరించారు. హైదరాబాద్ తరహా నగరం ఒకటి అవసరమని భావించే, అమరావతి రూపకల్పన చేశామన్నారు. కానీ విభజన అనంతరం అనేక సమస్యలు ఏర్పడ్డాయని, ఆంధ్రప్రదేశ్‌లో క్లిష్టమైన సమస్యలు తలెత్తాయన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఐదేళ్ల పాలన సవాళ్లతో సాగిందని తెలిపారు. అన్నిటినీ అధిగమించి, ఐదేళ్లు అభివృద్ధి 10.8 శాతంగా నమోదైందని తెలిపారు. ఇప్పుడు 3.5 శాతంగా ఉందన్నారు. అమరావతిని హైదరాబాద్‌ను మించి అభివృద్ధి చేయవచ్చు. విజన్-2029 లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు. ఇప్పుడు అక్కడ అభివృద్ధి ఆగిపోయింది. కారణాలు ఏమిటన్నది.. ఇక్కడ రాజకీయాలు మాట్లాడలేను. అమరావతిని పునర్నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.