ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో ఎమర్జెన్సీ లాంటి వాతావరణం వుందని మండిపడ్డారు. సీఎం జగన్ కి ఓటమి భయం పట్టుకుందని, అందుకే తమపై తప్పుడు కేసులు పెట్టి, పర్యటనలను అడ్డుకోవాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన రెండో రోజూ కొనసాగుతోంది. కొంత మంది పోలీసులు స్వార్థం కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, పోలీసులు తీసుకెళ్లిన టీడీపీ చైతన్య రథాన్ని వెంటనే తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. తాను సీఎంగా వున్న సమయంలో వైఎస్, జగన్, షర్మిల పాదయాత్రలు చేశారని, ఆ పాదయాత్రలకు పోలీసు భద్రత కల్పించామని గుర్తు చేశారు.

ఇప్పుడు వీరు మాత్రం తమను అడ్డుకుంటున్నారని, దాడి చేసి, తిరిగి తమపై కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. రోడ్డు షోలు ఏపీకి ఏమైనా కొత్తా? అంటూ మండిపడ్డారు. గత 70 సవత్సరాలుగా జరగడం లేదా? జగన్ చేసిన పాదయాత్రలో రోడ్డుషోలు లేవా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. తమపై పోలీసులు అక్రమ కేసులు పెడితే.. తాము కూడా పోలీసులపై ప్రైవేట్ కేసులు పెడతామన్నారు. కుటుంబాలు ఎలా బాధపడతాయో పోలీసులకు తెలియజేస్తామని తెలిపారు. పోలీసులు ఆలోచించాలి.. 5 కోట్ల మందికి సహకరిస్తారా.. శాడిస్ట్ సీఎం పక్కన ఉంటారా అని ప్రశ్నించారు.












