తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి కేంద్రం జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. అన్నామలైకి రక్షణగా మొత్తం 33 మంది సీఆర్పీఎఫ్ కమాండోలను నియమించింది. అయితే.. ఇంటెలిజెన్స్ నివేదిక తర్వాతే కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో బీజేపీ అధ్యక్షుడి హోదాలో అన్నామలై బలంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, నిరసనలను ప్రారంభించారు. నేరుగా సీఎం స్టాలిన్, ఆయన సిద్ధాంతాలపైనే విమర్శలకు దిగుతున్నారు. దీంతో పలువురు వ్యక్తులు, మావోయిస్టులు, తీవ్రవాదుల నుంచి అన్నామలైకి బెదిరింపు కాల్స్ ప్రారంభమయ్యాయి. మొదట్లో ఆయనకు వై కేటగిరీ భద్రత వుండేది. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో కేంద్రం ఆయనకు తాజాగా జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.












